దస్తూరిపై దృష్టి సారించాలి..
కాళోజీ సెంటర్ : టెన్త్.. ప్రతీ విద్యార్థి దశలో అత్యంత కీలకం. వారి ఉజ్వల భవిష్యత్‌ను నిర్ణయించే తరగతి ఇదే. కలల సౌధానికి పునాది ఏర్పడేది కూడా ఇక్కడే. అయితే పరీక్షల సమయం దగ్గర పడుతున్న కొద్దీ విద్యార్థుల్లో ఆందోళన నెలకొంటుంది. పరీక్ష హాల్‌లో ప్రశ్నపత్రం చూడగానే ఒక్కసారిగా భయాందోళనకు గురై జవాబు రాయలేక పోతుంటారు. ఇలా కాకుండా భయపెట్టే అంశాలను వీడి సానుకూల దృక్పథంతో ఆలోచించాలని, తద్వారా ఏదైనా సాధ్యమేనని సైకాలజిస్ట్‌లు పేర్కొంటున్నారు. రాష్ట్రంలో ఈ నెల 14వ తేదీ నుంచి పదో తరగతి పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఈ క్రమంలో ప్రణాళిక, పట్టుదల ఉంటే పరీక్ష సమయంలో ఒత్తిడి అనే భయాన్ని అధిగమించడం చాలా సులభమని వారు పేర్కొంటున్నారు. పరీక్షల సమయంలో తీసుకోవాల్సిన పలు అంశాలపై పదో తరగతి విద్యార్థులకు వారు పలు సూచనలు చేస్తున్నారు.
ప్రతీ విద్యార్థి సానుకూల దృక్పథంతో ఉండాలి..
నేను చేయగలను.. నేను సాధించగలననే సానుకూల దృక్ఫథం పెంచుకున్నప్పుడే ఏదైనా సాధ్యమవుతుంది. పరీక్షలంటే భయం వీడాలి. అప్పుడే విజయం ధరిచేరుతుంది. నేను సాధించగలను అనే నమ్మకం సగం విజయాన్ని అందించడానికి దోహదపడుతుందని నిపుణులు తెలుపుతున్నారు. ముందు పరీక్షలంటే భయం వీడాలి. అప్పుడే విజయం లభిస్తుందన్నారు. భయం జ్ఞాపకశక్తిని తగ్గిస్తుందని తెలుపుతున్నారు.
పరీక్షల్లో విద్యార్థుల భవితవ్యం నిర్దేశించేది చేతి రాత. ముత్యాల్లాంటి అక్షరాలు పరీక్షల్లో మార్కులపై ప్రభావం చూపుతాయి. కొట్టి వేతలు లేని కుదురైన దస్తూ రి కనిపిస్తే కచ్చితంగా మూల్యాంకనం చేసే వ్యక్తి సదుభిప్రాయానికి వచ్చి కనీసం 20 మార్కులు సాధించే అవకాశం ఉంటుంది. విద్యార్థులు పొరపాట్లు చేయడం వల్ల మార్కులు తగ్గడానికి అవకాశం ఉంటుంది. జవాబులో ముఖ్యమైన పాయింట్లను ఇచ్చే సంజ్ఞలను మార్జిన్‌లో ఒక దాని కింద మరోటి వేయకుండా గీత చివరి వరకు రాస్తూ చివరికి వెళ్లగానే అక్కడ సగం పదం రాసి మరో సగం కింద వరుసలో రాస్తుంటారు. దీంతో పేపర్ మూల్యాంకనం చేసే వారికి ఆ పూర్తి పదం ఏంటో వెంటనే అర్థం కాదు. అందుకే జాగ్రత్తగా పదాల పొందుపరిచే విధానం బాగుండేలా రాయాలని కౌన్సెలింగ్ సైకాలజిస్ట్‌లు సూచిస్తున్నారు.
సానుకూల దృక్పథంతో ఏదైనా సాధ్యమే
భయపెట్టే అంశాలను విడనాడాలి
దస్తూరిపై దృష్టిపెడితే మంచి మార్కులు
టెన్త్ విద్యార్థులకు సైకాలజిస్ట్‌ల సూచనలు


