హన్మకొండ: వ్యవసాయానికి 24 గంటలపాటు నిరంతరాయంగా విద్యుత్ ఇస్తున్నామని చెబుతున్న మాట ఉత్తదేనని విద్యుత్ వినియోగదారులు చెప్పారు. శుక్రవారం హనుమకొండ కలెక్టరేట్‌లోని కాన్ఫరెన్స్ హాల్‌లో 2026–27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన రిటైల్ విద్యుత్ సరఫరా వ్యాపారం కోసం సవరణ చేసిన సమగ్ర ఆదాయ అవసరాలు, విద్యుత్ ధరల ప్రతిపాదనలు, ఓపెన్ యాక్సెస్, వినియోగదారులపై క్రాస్ సబ్సిడీ, సర్‌చార్జీల ప్రతి పాదనలపై తెలంగాణ విద్యుత్ నియంత్రణ మండలి చైర్మన్ జస్టిస్ దేవరాజు నాగార్జున్, ఫైనాన్స్ మెంబర్ చెరుకూరి శ్రీనివాస రావు, టెక్నికల్ మెంబర్ రఘు కంచెర్ల బహిరంగ విచారణ చేపట్టారు. ఆదిలాబాద్‌కు చెందిన బీకేఎస్ నాయకుడు భూమారెడ్డి, జగిత్యాల జిల్లాకు చెందిన విక్రమ్ రెడ్డి మాట్లాడుతూ వ్యవసాయానికి 24 గంటలు విద్యుత్ సరఫరా ఇవ్వడం లేదని రోజుకు 7 నుంచి 12 గంటలు మాత్రమే ఇస్తున్నారన్నారు. మాజీ మంత్రి జలగం ప్రసాద రావు మాట్లాడుతూ ఎన్పీడీసీఎల్‌లో ఉద్యోగుల కొరత తీవ్రంగా ఉందన్నారు. ఆపరేటర్‌లు లేక కొత్త సబ్‌స్టేషన్లు నిరుపయోగంగా ఉన్నాయన్నారు. ఆయా జిల్లాల రైతు సంఘాల నాయకులు, వినియోగదారులు మాట్లాడుతూ ఆదిలాబాద్, కరీంనగర్‌లో సీజీఆర్‌ఎఫ్ ఏర్పాటు చేయాలని, సీజీఆర్‌ఎఫ్ నిర్వహిస్తున్న లోకల్ కోర్టుల సంఖ్యలో నెలకు కనీసం 10కి పెంచాలని కోరారు. విద్యుత్ షాక్ మృతి ఎక్స్‌గ్రేషియా రూ.10 లక్షలకు పెంచాలన్నారు. అనంతరం రైతు సంఘం నాయకుడు శ్రీధర్ రెడ్డి మాట్లాడారు. పలువురు వినియోగదారులు సమస్యలు వివరించగా వాటిని పరిశీలించాలని ఈఆర్‌సి చైర్మన్ జస్టిస్ నాగార్జున్ ఆదేశించారు.
వినియోగదారులకు అత్యుత్తమ సేవలు
విద్యుత్ వినియోగదారులకు నాణ్యమైన, మెరుగైన విద్యుత్ అందిస్తున్నామని టీజీ ఎన్పీడీసీఎల్ సీఎండీ కర్నాటి వరుణ్ రెడ్డి చెప్పారు. బహిరంగ విచారణలో 38 మంది వినియోగదారులు అభ్యంతరాలు లేవనెత్తగా వరుణ్ రెడ్డి సమాధానం ఇస్తూ సబ్ స్టేషన్లను రిమోట్ మానిటర్ ద్వారా ప్రారంభించడానికి సన్నాహాలు చేస్తున్నామన్నారు. ఆసుపాక, కమలాపూర్ 33 కేవీ కొత్త లైన్, గుండాల 132 కేవీ సబ్ స్టేషన్లకు టెండర్ పిలిచామన్నారు. వాట్సాప్ చాట్ బాట్, టోల్ ఫ్రీ నంబర్ 1912, టీజీ ఎన్పీడీసీఎల్ పోర్టల్ ద్వారా సమస్యలు నమోదు చేసుకోవచ్చన్నారు. విద్యుత్ ప్రమాదాలు 22 శాతానికి తగ్గించా మని అన్నారు. ట్రాన్స్‌ఫార్మర్లు, జీపీల్లో 1912 రాయించి అవగాహన కల్పిస్తున్నామన్నారు. సోలార్ రూఫ్ టాప్ ద్వారా 135 మెగావాట్లు గ్రిడ్‌కు కనెక్ట్ చేస్తున్నామని చెప్పారు. ఖమ్మంలోని బోనకల్ మండలాన్ని మోడల్ సోలార్ గ్రామంగా తీర్చిదిద్దుతున్నామని చెప్పారు.
పరిశ్రమలపై విద్యుత్ భారాన్ని తగ్గించాలి
వరంగల్: జిల్లాలో పరిశ్రమల స్థాపనకు, ప్రస్తుత ఉన్న పరిశ్రమల పురోగతికి పరిశ్రమలపై విద్యుత్ భారాన్ని తగ్గించాలని తెలంగాణ కాటన్ మిల్లర్స్ అండ్ ట్రేడర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు, వరంగల్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ అధ్యక్షులు బొమ్మినేని రవీందర్‌రెడ్డి, ఉమ్మడి వరంగల్ జిల్లా కాటన్ అసోసియేషన్ అధ్యక్షులు చింతలపల్లి వీరారావులు అన్నారు. బహిరంగ విచారణలో పలు పారిశ్రామిక సమస్యలపై చర్చించారు.
70.29 లక్షల మంది వినియోగదారులు
టీజీఎన్పీడీసీఎల్‌లో 70.29 లక్షల మంది విని యోగదారులు ఉన్నారని, తలసరి విద్యుత్ విని యోగం 1,680 యూనిట్లుగా ఉందన్నారు. ఈ నెలలో అత్యధిక పీక్ డిమాండ్ 6441 మెగావాట్ల చేరుకుందని తెలిపారు. 150 కొత్త 33/11 కేవీ అవుట్‌డోర్ సబ్ స్టేషన్లు, ఇండోర్ సబ్ స్టేషన్లు 5 నిర్మిస్తున్నట్లు తెలిపారు. పర్యావరణ పరిరక్షణ, విద్యుత్ నష్టాల తగ్గింపును లక్ష్యంగా పెట్టుకుని పీఎం కుసుమ్ పథకం కింద డిస్ట్రిబ్యూటెడ్ సౌర విద్యుత్ ప్లాంట్ల ఏర్పాటు చేస్తున్నట్లు వివరించారు. ఎన్పీడీసీఎల్ డైరెక్టర్లు తిరుపతిరెడ్డి, మధుసూదన్, ప్రభాకర్, మోహన్ రావు పాల్గొన్నారు.
రోజుకు 7 నుంచి 12 గంటలే సరఫరా
సిబ్బంది కొరతతో ఇబ్బందులు
సీజీఆర్‌ఎఫ్‌లు ఏర్పాటు చేయాలి
బహిరంగ విచారణలో వినియోగదారులు


