ల్యాబ్‌ల నిర్వహణకు నిధులు
మహబూబాబాద్ అర్బన్: జిల్లాలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో సైన్స్ ల్యాబ్‌ల నిర్వహణకు ఇంటర్ బోర్డు నిధులు విడుదల చేసింది. త్వరలో ప్రాక్టికల్ పరీక్షలు జరగనున్న నేపథ్యంలో బోర్డు ఈ నిర్ణయం తీసుకుంది. ఒక్కో ప్రభుత్వ జూనియర్ కళాశాలకు రూ.50 వేల చొప్పున.. జిల్లాలోని పది కాలేజీలకు రూ.5లక్షలు విడుదల చేసింది. ఈ నిధులతో ల్యాబ్‌ల్లో అవసరమైన పరికరాలు, ఇతర సౌకర్యాలు సమకూర్చుకోవాలని సూచించింది. అలాగే ప్రాక్టికల్ పరీక్షల నిర్వహణ, కెమికల్స్, ఇతర వస్తువుల కొనుగోలు కోసం నిధులను వినియోగించుకోనున్నట్లు ఇంటర్ విద్యాశాఖ అధికారులు తెలిపారు.
జిల్లాలో 8257 విద్యార్థులు..
జిల్లాలో ఇంటర్ ప్రాక్టికల్స్‌పై మరింత కట్టుదిట్టమైన నిఘా పెట్టనున్నారు. ఈ మేరకు రాష్ట్ర ఇంటర్ బోర్డు చర్యలు చేపట్టింది. గత విద్యా సంవత్సరం సీసీ కెమెరాలు అమర్చి, కమాండ్ కంట్రోల్ సెంటర్ ద్వారా పర్యవేక్షించగా.. ఈసారి ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలను ఏర్పాటు చేయనున్నారు. జిల్లాలో జనరల్ గ్రూప్ ఇంటర్ ఫస్టియర్‌లో 3,148 మంది విద్యార్థులు, ద్వితీయ సంవత్సరంలో 3,100 మంది, ఒకేషనల్ ఫస్టియర్‌లో 998 మంది విద్యార్థులు, ఒకేషనల్ ద్వితీయ సంవత్సరంలో 1,011 మంది విద్యార్థులు చదువుతున్నారు. ప్రాక్టికల్ పరీక్షలు ఫిబ్రవరి 2నుంచి 21వ తేదీ వరకు ఉదయం, సాయంత్రం నిర్వహిస్తారు. వార్షిక పరీక్షలు ఫిబ్రవరి 25నుంచి మార్చి15వ తేదీ వరకు సీసీ కెమెరాల నిఘాలో జరగనున్నాయి. డిపార్ట్‌మెంటల్ అధికారులతో ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలను ఎక్కువ సంఖ్యలో ఏర్పాటు చేయనున్నారు. కాగా ఆయా కళాశాలల విద్యార్థుల ప్రాక్టికల్ పరీక్షలకు విడుదల చేసిన నిధులను సక్రమంగా ఖర్చు చేస్తారో లేదో వేచి చూడాలి.
సీసీ కెమెరాల మధ్య ప్రాక్టికల్ పరీక్షలు
ప్రాక్టికల్ సామగ్రి, రసాయనాల కొనుగోలుకు ఇంటర్ బోర్డు జిల్లాలోని 10కళాశాలలకు రూ.5లక్షలు విడుదల చేసింది. కలెక్టర్ అ నుమతితో వారం రోజుల్లో ప్రాక్టికల్ సామగ్రిని కొనుగోలు చేసి విద్యార్థులకు ఉపయోగించాలి. గత ఏడాది మాదిరిగానే సీసీ కెమెరాలు మధ్య ప్రాక్టికల్ పరీక్షలు జరుగుతాయి.
– సీహెచ్. మదార్‌గౌడ్, డీఐఈఓ
ఇంటర్ ప్రాక్టికల్స్‌కు రూ.ఐదు లక్షలు మంజూరు
ఒక్కో ప్రభుత్వ కళాశాలకు రూ.50వేల చొప్పున విడుదల
జిల్లాలో 8,257మంది విద్యార్థులు
ల్యాబ్‌ల నిర్వహణకు నిధులు
ల్యాబ్‌ల నిర్వహణకు నిధులు


