‘పది’లో మెరుగైన ఫలితాలు సాధించాలి
బయ్యారం: పదో తరగతి వార్షిక పరీక్షల్లో మెరుగైన ఫలితాలు సాధించాలని డీఈఓ రాజేశ్వర్ అన్నారు. మండలంలోని జగ్గుతండాలోని కస్తూర్బాగాంధీ బాలికల పాఠశాలను శుక్రవారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన వసతి గృహం నిర్వహణ, సదుపాయాలను పరిశీలించారు. అనంతరం తరగతి గదులను సందర్శించి విద్యార్థ్ధులతో మాట్లాడి వారి అభ్యసన స్థాయిని అంచనా వేశారు. అనంతరం విద్యార్థులు, ఉపాధ్యాయులను ఉద్దేశించి మాట్లాడారు. ఏసీజీఈ మందుల శ్రీరాములు, ఎస్‌ఓ నీలిమ పాల్గొన్నారు.
ప్రత్యేక శిక్షణ కార్యక్రమాలు చేపట్టాలి
గంగారం: పదో తరగతిలో మెరుగైన ఫలితాలు సాధించేలా విద్యార్థులకు ప్రత్యేక శిక్షణ కార్యక్రమాలు చేపట్టాలని డీఈఓ రాజేశ్వర్ అన్నారు. మండలం కేంద్రంలోని కేజీబీవీని శుక్రవారం ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. విద్యార్థులు, ఉపాధ్యాయు ల హాజరుశాతం, వసతి గృహాల నిర్వహణ, ఆరో గ్యం, శుభ్రత, సదుపాయాలు, భోజనశాల, వంటగది, హాస్టల్ పరిసరాలను పరిశీలించారు. అనంతరం పాఠశాల రికార్డులను తనిఖీ చేశారు. కార్యక్రమంలో ఏసీజీఈ మందుల శ్రీరాములు, ఎస్‌ఓ సుజాత, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.
కేజీబీవీ ఆకస్మిక తనిఖీ
కొత్తగూడ: మండలంలోని పోలారం కస్తూర్బాగాంధీ పాఠశాలను డీఈఓ రాజేశ్వర్ శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. పాఠశాల పరిసరాలను పరిశీలించారు. విద్యార్థులతో మాట్లాడి వసతుల గురించి తెలుసుకున్నారు. సోలార్ వాటర్ హీటర్ పని చేయకపోవడం వల్ల చన్నీటిస్నానం చేయలేకపోతున్నామని విద్యార్థులు తెలిపారు. ఆర్‌ఓ వాటర్ ప్లాంట్ బిగించి ప్రారంభించలేదని, తదితర సమస్యలు డీఈఓ దృష్టికి తీసుకెళ్లారు. ప్లాంట్ ప్రారంభించేందుకు చర్యలు తీసుకుంటామని డీఈఓ తెలి పారు. జిల్లాలోని అన్ని కేజీబీవీల్లో సోలార్ వాటర్ హీటర్లు పని చేయడం లేదని వాటి స్థానంలో కొత్తవి బిగించేందుకు ప్రభుత్వానికి నివేదిక పంపిస్తామన్నారు. అనంతరం పాఠశాల రికార్డులు పరిశీలించారు. ఆయన వెంట ఎస్‌ఓ సౌమ్య ఉన్నారు.


