ట్రాఫిక్ నిబంధనలు పాటించాలి
● వరంగల్ సీపీ సన్‌ప్రీత్ సింగ్
వరంగల్ క్రైం : ప్రతీ వాహనదారుడు ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని వరంగల్ పోలీస్ కమిషనర్ సన్‌ప్రీత్‌సింగ్ పిలుపునిచ్చారు. జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవాల సందర్భంగా నగర ప్రజలకు ట్రాఫిక్ నిబంధనలతో పాటు హెల్మెట్ ప్రాధాన్యంపై అవగాహన కల్పించేందుకు ట్రాఫిక్ పోలీసుల ఆధ్వర్యంలో శుక్రవారం బైక్ ర్యాలీ నిర్వహించారు. ముఖ్య అతిథిగా సీపీ హాజరై ర్యాలీని ప్రారంభించి, అధికారులు, సిబ్బందితో కలిసి హెల్మెట్ ధరించి బైక్ ర్యాలీలో పాల్గొన్నారు. వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరేడ్ మైదానం నుంచి ప్రారంభమైన ర్యాలీ హనుమకొండ చౌరస్తా, ములుగు రోడ్, ఎంజీఎం, పోచమ్మ మైదానంలోని ఎస్‌ఆర్ కళాశాల వరకు కొనసాగింది. అనంతరం విద్యార్థులతో ఏర్పాటు చేసిన సమావేశంలో సీపీ మాట్లాడారు. గతేడాది వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో రోడ్డు ప్రమాదాల కారణంగా 450కు పైగా మృత్యువాత పడ్డారని, అలాగే 9 లక్షల మంది వాహనదారులకు హెల్మెట్ ధరించని కారణంగా జరిమానాలు విధించామన్నారు. అనంతరం ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తామని విద్యార్థులచేత ప్రతిజ్ఞ చేయించారు. ఈస్ట్ జోన్ డీసీపీ అంకిత్ కుమార్, వరంగల్ ఏఎస్పీ శుభం, అదనపు డీసీపీలు ప్రభాకర్ రావు, శ్రీనివాస్, సురేష్ కుమార్, ఏిసీపీలు సత్యనారాయణ, ప్రశాంత్ రెడ్డి, సురేంద్ర, నాగయ్య, జాన్ నర్సింహులతో పాటు ట్రాఫిక్ ఇన్‌స్పెక్టర్లు సీతారెడ్డి, వెంకన్న, సుజాత, నగరానికి చెందిన ఇన్‌స్పెక్టర్లు, ఆర్‌ఐలు, ఆర్‌ఎస్సైలు, ఎస్సెలు, పోలీసులు, యువత ర్యాలీలో పాల్గొన్నారు.


