ద్విచక్ర వాహనాల దొంగ అరెస్ట్
● ఇద్దరి పరార్, మూడు బైక్‌ల స్వాధీనం
జనగామ: బైక్ దొంగతనాలకు పాల్పడుతున్న ఓ యువకుడిని జనగామ పోలీసులు అదుపులోకి తీసుకోగా, మరో ఇద్దరు పరార్ అయ్యారు. శుక్రవారం సీఐ సత్యనారాయణరెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. మహబూబాద్ జిల్లా తొర్రూరు మండలం కంటాయపాలెం గ్రామానికి చెందిన నిందితుడు చర్లపల్లి కార్తీక్, అతని బంధువులు హుజూరాబాద్‌కు చెందిన దండుగుల వెంకటేష్, నల్లబెల్లికి చెందిన(ప్రస్తుత నివాసం మూసాపేట్) హేమంత్‌లతో కలిసి ఇటీవల హైదరాబాద్‌లో కూలిపని చేస్తూ బతుకుతున్నారు. కూలి పనితో వచ్చిన డబ్బులను జల్సాలు, చెడు వ్యసనాల కోసం ఖర్చు చేస్తూ మేడారం జాతర సమయంలో మోటార్ సైకిళ్లు సులభంగా దొంగిలించవచ్చని ప్లాన్ వేసుకున్నారు. ఈ నెల 3వ తేదీన హైదరాబాద్ నుంచి మేడారం వైపు వెళ్తున్న ముగ్గురు బీబీనగర్ టోల్‌ప్లాజా, జనగామ మండలం పెంబర్తి గ్రామం సమీపంలో మరో మోటార్ సైకిల్‌ను దొంగిలించారు. హైదరాబాద్ నుంచి తీసుకొస్తున్న బైక్‌ను అక్కడే వదిలి వెళ్లారు. రఘునాథపల్లిలో ఓ ఇంటి బయట పార్కింగ్ చేసిన స్కూటీ దొంగిలించి, మూడు ద్విచక్రవాహనాలపై మేడారం జాతరకు వెళ్లి, తిరిగి బయల్దేరారు. ఈ క్రమంలో వెస్ట్ జోన్ డీసీపీ రాజమహేంద్ర నాయక్, ఏఎస్పీ పండేరి చేతన్ నితిన్, సీఐ సత్యనారాయణెడ్డి పర్యవేక్షణలో పెంబర్తి వై జంక్షన్ వద్ద ఎస్సై నర్సయ్య తనిఖీ చేస్తున్న క్రమంలో ముగ్గురు పారిపోయే ప్రయత్నం చేశారు. పోలీసులు వెంబడించి కార్తీక్‌ను పట్టుకోగా, హేమంత్, వెంకటేష్ ఇద్దరూ తమ వద్ద ఉన్న రెండు బైక్‌లను వదిలేసి పరారయ్యారు. విచారణలో కార్తీక్ చేసిన నేరాలను ఒప్పుకోగా, మూడు బైక్‌లను స్వాధీనం చేసుకున్నట్లు సీఐ తెలిపారు. ప్రతిభ కనబరిచిన సీఐ సత్యనారాయణరెడ్డి, ఎస్సై నర్సయ్య, కానిస్టేబుళ్లు సాగర్, కృష్ణ, అనిల్, రమేశ్‌ను వరంగల్ సీపీ సన్‌ప్రీత్‌సింగ్ అభినందించారు.


