మెనూ పాటించడం లేదు
● ఎల్లంపేట హైస్కూల్ విద్యార్థుల నిరసన
మరిపెడ రూరల్: పాఠశాలలో మధ్యాహ్న భోజనం మెనూ పాటించకుండా నీళ్లచారు, ఉడికి ఉడకని అన్న ం వడ్డిస్తున్నారని మండలంలోని ఎల్లంపేట జెడ్పీ ఉన్నత పాఠశాల విద్యార్థులు స్కూల్ ఎదుట రోడ్డుపై నిరసన తెలిపారు. ఈ సందర్భంగా విద్యార్థులు మాట్లాడుతూ.. గ్రామానికి చెందిన స్నేహశీలి మహిళా సంఘం వంట ఏజెన్సీ నిర్వాహకులు మధ్యాహ్న భోజనం వండి వడ్డిస్తున్నారని, అయితే మెనూ పాటించడం లేదని ఆరోపించారు. ఇదేమిటని ప్రశ్నిస్తే దురుసుగా సమాధానం చెప్పుతున్నారని విద్యార్థులు వాపోయారు. పాఠశాలలో 150మంది విద్యార్థులకు 50నుంచి 60మంది మాత్రమే భోజనం చేస్తున్నారని, మిగిలిన విద్యార్థులు బాక్స్ తెచ్చుకుంటున్నట్లు తెలిపారు. విషయం తెలుసుకున్న గ్రామస్తులు, ఎంఈఓ అనితాదేవి, తహసీల్దార్ కృష్ణవేణి, ఎంపీఓ సోమ్లనాయక్ పాఠశాలకు చేరుకుని విద్యార్థులను సముదాయించారు. మెనూ పాటించడంతో పాటు నాణ్యమైన భోజనం, గుడ్డు అందించేలా వంట నిర్వాహకులపై చర్యలు తీసుకోవాలని ఎంఈఓకు గ్రామస్తులతో కలిసి విద్యార్థులు వినతిపత్రం అందజేశారు. కాగా వంట ఏజెన్సీ నిర్వాహకులపై ఎంఈఓ, తహసీల్దార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. నాణ్యమైన భోజనం వడ్డించాలని, లేని క్రమంలో కొత్త ఏజెన్సీని నియమించేలా వంట నిర్వాహకుల నుంచి రాత పూర్వకంగా ఒప్పంద పత్రం తీసుకున్నారు.


