గంజాయి సాగు చేస్తే జైలుకే..
● ఎస్పీ శబరీష్
మహబూబాబాద్ రూరల్ : గంజాయి సాగు చేస్తే జైలు శిక్ష తప్పదని ఎస్పీ శబరీష్ అన్నారు. జిల్లా పోలీసు కార్యాలయంలో గురువారం ఎస్పీ మాట్లాడుతూ.. గంజాయి సాగుకు అడ్డుకట్ట వేసేందుకు సీసీఎఎస్, స్పెషల్ పార్టీ పోలీసులతో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశామన్నారు. జిల్లా పరిధిలో గంజాయి సాగు చేస్తున్న ప్రాంతాలను గుర్తించేందుకు విస్తృతంగా తనిఖీలు చేపడుతున్నట్లు తెలిపారు. డ్రోన్ల ద్వారా వ్యవసాయ భూములు, అటవీ, కొండ ప్రాంతాలు, దూర గ్రామ ప్రాంతాలపై పర్యవేక్షణ చేస్తున్నామన్నారు. పాత గంజాయి నేరస్తులు, గంజాయి విక్రయించే వ్యక్తులు, అక్రమ రవాణా మార్గాలు, గంజాయి నిల్వ చేసే ప్రాంతాలు, విక్ర య కేంద్రాలపై నిరంతర నిఘా కొనసాగిస్తున్నట్లు తెలిపారు. గంజాయి సాగు, అక్రమ రవాణా లేదా విక్రయాలకు సంబంధించిన సమాచారం ఎవరికై నా తెలిస్తే, భయపడకుండా వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలన్నారు. వారి వివరాలను పూర్తి గా గోప్యంగా ఉంచుతామని హామీ ఇస్తూ, ప్రజల సహకారంతోనే గంజాయి రహిత జిల్లా సాధ్యమవుతుందని పేర్కొన్నారు. జిల్లాలోని నర్సింహులపేట పోలీసు స్టేషన్ పరిధిలోని ఓ వ్యవసాయ ప్రాంతంలో అక్రమంగా గంజాయి సాగు చేస్తున్న క్రమంలో సమాచారం తెలుసుకున్న పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకుని, కేసు నమోదు చేసి జైలుకు తరలించినట్లు తెలిపారు.


