మూడు షిఫ్ట్‌లు.. 24 గంటలు పహారా
ప్రత్యేక శిక్షణ..
2 కోట్ల మంది భక్తులు వస్తారని అంచనా..
హన్మకొండ అర్బన్: ఆసియాలోనే అతిపెద్ద గిరిజన పండుగ, తెలంగాణ కుంభమేళా మేడారం సమ్మక్క–సారలమ్మ మహా జాతరకు అధికార యంత్రాంగం సర్వం సిద్ధం చేస్తోంది. ఈనెల 28 నుంచి 31 వరకు అత్యంత వైభవంగా జరగనున్న జాతర నిర్వహణకు ములుగు జిల్లా కలెక్టర్ దివాకర భారీస్థాయిలో అధికారులు, సిబ్బందిని కేటాయిస్తూ కీలక ఉత్తర్వులు జారీ చేశారు. భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఉండేందుకు మొత్తం 660 మంది అధికారులను విధుల్లోకి దించుతున్నారు. జోనల్, నోడల్ అధికారులు, వివిధ శాఖల అధికారులు విధులు కేటాయించారు.
జోనల్, నోడల్ అధికారులు: జాతర ప్రాంగణాన్ని వివిధ సెక్టార్లుగా విభజించి, వాటి పర్యవేక్షణ కోసం 95 మంది ఉన్నతస్థాయి అధికారులను నియమించారు.
సిబ్బంది విభజన: ఉమ్మడి వరంగల్ జిల్లాలోని హనుమకొండ, వరంగల్, జనగామ, మహబూబాబాద్, జయశంకర్ భూపాలపల్లి జిల్లాలనుంచి రెవెన్యూ, పంచాయతీ రాజ్, మున్సిపల్, నీటి సరఫరా, విద్యుత్ వంటి అన్ని శాఖల అధికారులకు విధులు కేటాయించారు..
పోలీస్ పహారా: ఐపీఎస్ స్థాయి అధికారుల పర్యవేక్షణలో భారీగా పోలీస్ బందోబస్తు ఉండనుంది. వీరు ట్రాఫిక్ నియంత్రణ, భద్రత పర్యవేక్షిస్తారు.
మూడు షిఫ్టుల్లో 24 గంటల సేవలు
కోట్లాదిగా వచ్చే భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని, అధికారులను మూడు షిఫ్టుల్లో పనిచేయనున్నారు.
మొదటి షిఫ్ట్: ఉదయం 7 నుంచి మధ్యాహ్నం 2 వరకు.
రెండవ షిఫ్ట్: మధ్యాహ్నం 2నుంచి రాత్రి 10 వరకు.
మూడవ షిఫ్ట్: రాత్రి 10 నుంచి మరుసటిరోజు ఉదయం 7 వరకు.
విధులకు ఎంపికై న 660 మంది అధికారులకు, సిబ్బందికి మంగళవారం నుంచి గురువారం వరకు మూడు రోజులపాటు మేడారంలోని హరిత హోటల్‌లో ప్రత్యేక శిక్షణ, అవగాహన సదస్సులు నిర్వహించనున్నారు. జాతరను విజయవంతం చేసి, భక్తులకు అమ్మవార్ల దర్శనం సులువుగా కలిగేలా చూడటమే లక్ష్యంగా యంత్రాంగం కదులుతోంది. వీరుకాక పోలీస్ శాఖ, ఎన్‌ఎస్‌స్, ఎన్‌సీసీ, ఇతర స్వచ్ఛంద, యువజన సంఘాల సేవలు అదనంగా వాడుకోనున్నారు.
మేడారం జాతర విధులకు ఉమ్మడి జిల్లానుంచి 660 మంది అధికారులు
మహా జాతరపై ములుగు జిల్లా అధికార యంత్రాంగం కసరత్తు
జోనల్, నోడల్ అధికారులుగా
95 మంది నియామకం
నేటినుంచి మూడు రోజులపాటు శిక్షణ
26న రిపోర్ట్ చేయాలని ఆదేశం
ఈసారి మేడారం జాతరకు సుమారు 2 కోట్ల మంది భక్తులు వస్తారని ప్రభుత్వం అంచనా వేస్తోంది. భక్తుల రద్దీకి తగ్గట్లుగా క్యూ లైన్ల నిర్వహణ, తాగునీరు, పారిశుద్ధ్యం, అత్యవసర వైద్యసేవల కోసం ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. జాతర తేదీలకు రెండు రోజుల ముందే, అంటే జనవరి 26 నాటికే అధికారులు తమకు కేటాయించిన స్థానాల్లో రిపోర్ట్ చేయాలని, విధుల్లో ఏమాత్రం నిర్లక్ష్యం వహించినా కఠిన చర్యలు తప్పవని కలెక్టర్ హెచ్చరించారు.


