మంత్రి శ్రీహరిని కలిసిన పారా అథ్లెట్ జీవాంజి దీప్తి
పర్వతగిరి: వరంగల్ జిల్లా పర్వతగిరి మండలం కల్లెడ గ్రామానికి చెందిన పారా అథ్లెట్ జీవాంజి దీప్తి సోమవారం పశు సంవర్థక, క్రీడలు, యువజన సర్వీసుల శాఖ మంత్రి వాకిటి శ్రీహరి, వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్.నాగరాజును కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. వచ్చే ఏషియన్ చాంపియన్ షిప్‌లో పాల్గొంటున్న సందర్భంగా ప్రాక్టీస్ గురించి మంత్రి, ఎమ్మెల్యేకు వివరించారు. రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని మంత్రి భరోసా ఇచ్చినట్లు దీప్తి తెలిపారు. ఈ కార్యక్రమంలో దీప్తి తల్లిదండ్రులు ధనమ్మ, యాదగిరి పాల్గొన్నారు.
వరంగల్‌లో అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం నిర్మించాలి
● అసెంబ్లీలో కోరిన ఎమ్మెల్యే కడియం శ్రీహరి
స్టేషన్‌ఘన్‌పూర్: వరంగల్‌లో అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం, శాశ్వత క్రీడాపాఠశాల నిర్మాణానికి స్థలం గుర్తించి పనులు ప్రారంభించాలని స్టేషన్‌ఘన్‌పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి కోరారు. ఈ మేరకు సోమవారం ఆయన అసెంబ్లీ సమావేశాల్లో మాట్లాడుతూ చారిత్రక వరంగల్ జిల్లాను విద్యనేకాకుండా క్రీడా కేంద్రంగా అభివృద్ధి చేయాలని ఉమ్మడి వరంగల్ జిల్లా ఎమ్మెల్యేలం కోరగా సీఎం రేవంత్‌రెడ్డి సానుకూలంగా స్పందించారన్నారు. హైదరాబాద్ తర్వాత అతిపెద్ద నగరంగా ఉన్న వరంగల్‌లో అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం నిర్మాణం, రెసిడెన్షియల్ క్రీడాపాఠశాల ఏర్పాటుకు హామీ ఇచ్చారన్నారు. హామీ ఇచ్చి ఆరునెలలు గడిచాయని, వెంటనే స్పందించి అంతర్జాతీయ ప్రమాణాలతో క్రికెట్ స్టేడియం, శాశ్వత క్రీడా పాఠశాల నిర్మాణ పనులు చేపట్టాలని ఈ సందర్భంగా కోరారు.
వీధికుక్క అడ్డు రావడంతో..
● బైక్ అదుపు తప్పి ఆర్టీసీ డ్రైవర్ మృతి
గీసుకొండ: వీధికుక్క అడ్డు రావడంతో బైక్ అదుపు తప్పింది. ఈ ప్రమాదంలో ఆర్టీసీ డ్రైవర్ మృతి చెందాడు. ఈ ఘటన సోమవారం వరంగల్ జిల్లా గీసుకొండ మండలం ధర్మారం వద్ద చోటు చేసుకుంది. గీసుకొండ సీఐ విశ్వేశ్వర్ కథనం ప్రకారం.. మండలంలోని గంగదేవిపల్లికి చెందిన గూడ సంతోష్(40) హనుమకొండ ఆర్టీసీ బస్ డిపోలో డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. వ్యక్తి గత పని నిమిత్తం బైక్‌పై నగరానికి వచ్చిన సంతోష్.. సాయంత్రం 4.30 గంటల సమయంలో స్వగ్రామానికి వెళ్తున్నాడు. ఈ క్రమంలో ధర్మారం రంగనాయకుల కుంట వద్దకు చేరుకోగానే వీధి కుక్కలు అడ్డు రావడంతో బైక్ అదుపు తప్పి డివైడర్‌ను ఢీకొంది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన సంతోష్ అక్కడే మృతి చెందాడు. మృతుడికి భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. మృతుడి భార్య సుజాత ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తునట్లు సీఐ విశ్వేశ్వర్ తెలిపారు.
మంత్రి శ్రీహరిని కలిసిన పారా అథ్లెట్ జీవాంజి దీప్తి
మంత్రి శ్రీహరిని కలిసిన పారా అథ్లెట్ జీవాంజి దీప్తి


