కాంగ్రెస్ ప్రభుత్వంలో క్రీడలకు పెద్దపీట
కాజీపేట రూరల్ : రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం క్రీడలకు పెద్దపీట వేస్తోందని తెలంగాణ రాష్ట్ర ఖోఖో సంఘం అధ్యక్షుడు, రాష్ట్ర ఆయిల్ ఫెడ్ కార్పొరేషన్ చైర్మన్ జంగా రాఘవరెడ్డి అన్నారు. సోమవారం కాజీపేట రైల్వే స్టేడియంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ నెల 11 నుంచి 15వ తేదీ వరకు ఉమ్మడి వరంగల్ జిల్లా కాజీపేట రైల్వే స్టేడియంలో మొదటిసారి 58వ జాతీయస్థాయి సీనియర్స్ ఖోఖో పోటీలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ పోటీల్లో 29 రాష్ట్రాల నుంచి 79 జట్లతో 2 వేల మంది క్రీడాకారులు, టెక్నికల్ అఫీషియల్స్, అధికారులు పాల్గొంటున్నట్లు వివరించారు. పోటీల ప్రారంభోత్సవానికి సీఎం రేవంత్‌రెడ్డి వచ్చే అవకాశం ఉందన్నారు. పోటీలు డే అండ్ నైట్ నిర్వహించేందుకు భారీ ఎత్తున ఫ్లడ్ లైట్లు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ప్రపంచస్థాయి క్రీడగా మారిన గ్రామీణ ఖోఖో పోటీలను మ్యాట్‌లపై నిర్వహించనున్నామని పేర్కొన్నారు. పోటీల్లో పాల్గొనే వారికి 7 రోజుల పాటు ఉచిత భోజనం, వసతి, బస్సు సౌకర్యం ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. సమావేశంలో రాష్ట్ర జూడో అసోసియేషన్ అధ్యక్షుడు కై లాస్‌యాదవ్, పోటీల నిర్వాహణ కమిటీ ప్రధాన కార్యదర్శి, జిల్లా ఖోఖో అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి తోట శ్యాంప్రసాద్, జిల్లా ఖోఖో సంఘ ఉపాధ్యక్షుడు కుసుమ సదానందం, సంయుక్త కార్యదర్శి ఎం.రమణ, రాజారపు రమేశ్, శ్రీనివాస్, తెలంగాణ ఖోఖో సంఘం రెఫ్రిజ్ బోర్డు కన్వీనర్ వి.సూర్యప్రకాశ్, తదితరులు పాల్గొన్నారు.
తెలంగాణ రాష్ట్ర ఖోఖో సంఘం
అధ్యక్షుడు జంగా రాఽఘవరెడ్డి


