వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ముగ్గురి దుర్మరణం
పుట్టిన రోజే మృత్యుఒడికి..
లింగాలఘణపురం: పుట్టిన రోజే ఓ యువకుడు మృత్యుఒడికి చేరాడు. రోడ్డు ప్రమాదంలో అక్కడికక్కడే దుర్మరణం చెందాడు. దీంతో కొత్త సంవత్సరం రోజు కుటుంబంతోపాటు ఆ గ్రామంలో విషాదం నెలకొంది. పోలీసుల కథనం ప్రకారం.. జనగామ జిల్లా లింగాలఘణపురం మండలంలోని గుమ్మడవెల్లి కాలనీకి చెందిన దడిగ రమణకు ఇద్దరు కూతుళ్లు, కుమారుడు రవికుమార్(20) ఉన్నాడు. ప్రస్తుతం రవికుమార్ జనగామలో ఓ షాపులో పని చేస్తూ కుటుంబానికి ఆసరా అవుతున్నాడు. కాగా, నవాబుపేటకు చెందిన ఓ యువకుడు గ్రామంలో తనతో కొందరు గొడవ పడుతున్నారని, మీ స్నేహితులను తీసుకుని రావాలని జీడికల్‌కు చెందిన మిత్రుడు నరేశ్‌కు ఫోన్ చేశాడు. దీంతో అతను జీడికల్ నుంచి తన ట్రాలీలో కొంత మంది స్నేహితులను తీసుకుని గుమ్మడవెల్లి కాలనీకి వచ్చాడు. ఇక్కడ రవికుమార్‌తో పాటు మరికొందరిని తీసుకుని నవాబుపేటకు బయలుదేరాడు. ఈ క్రమంలో బుధవారం అర్ధరాత్రి తర్వాత గుమ్మడవెల్లి బస్టాండ్ వద్ద వాహనం అదుపు తప్పి చెట్టుకు ఢీకొని బోల్తా పడింది. ఈ ఘటనలో రవికుమార్ తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతి చెందగా మరో ముగ్గురికి గాయాలయ్యాయి. 108లో జనగామ జనరల్ ఆస్పత్రికి తరలించారు. బాధిత కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్సై శ్రావణ్‌కుమార్ వివరించారు. కాగా, చిన్నప్పుడే తండ్రి చనిపోవడంతో ఎన్నో కష్టాలు పడి పెంచి పెద్ద చేసిన కుమారుడు ప్రస్తుతం కుటుంబానికి ఆసరా అవుతున్న సమయంలో రోడ్డు ప్రమాదంలో మృతి చెందడంతో ఆ తల్లి రోదనలు మిన్నంటాయి.
న్యూ ఇయర్ కేక్ కోసం వెళ్తూ బాలుడు..
రఘునాథపల్లి: న్యూ ఇయర్ కేక్ కోసం వెళ్తున్న క్రమంలో ద్విచక్రవాహనం ఢీకొనడంతో ఓ బాలుడు మృతి చెందాడు. ఈ ఘటన జనగామ జిల్లా రఘునాథపల్లి మండలం నిడిగొండలో చోటుకుంది. పోలీసుల కథనం ప్రకారం .. మండలంలోని శ్రీమన్నారాయణపురం గ్రామానికి చెందిన పరికిబండ రమ్య కుమారులు రంజిత్‌కుమార్, రాజ్‌కుమార్ (14) బుధవారం రాత్రి న్యూ ఇయర్ సందర్భంగా కేక్ కొనుగోలు చేసేందుకు కాలినడకన నిడిగొండ జాతీయ రహదారిపైకి చేరుకున్నారు. అక్కడి నుంచి రఘునాథపల్లికి వెళ్లేందుకు వాహనాలను లిఫ్ట్ అడుగుతుండగా ఓ ద్విచక్రవాహనం వేగంగా వచ్చి రాజ్‌కుమార్‌ను ఢీకొంది. దీంతో తీవ్ర గాయాలు కావడంతో మేడిపల్లిలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ గురువారం మృతి చెందాడు. ఈ ఘటనపై మృతుడి తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై నరేశ్ తెలిపారు. న్యూఇయర్ వేళ ఈ ఘటనతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.
బైక్ చెట్టును ఢీకొన్న ప్రమాదంలో
యువకుడు..
బచ్చన్నపేట : బైక్.. చెట్టును ఢీకొన్న ప్రమాదంలో ఓ యువకుడు మృతి చెందాడు. ఈ ఘటన మండలంలోని సాల్వాపూర్‌లో చోటు చేసుకుంది. గ్రామస్తులు, పోలీసుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన చీర్ల వెంకటేష్ (36) వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఈ క్రమంలో గురువారం ఉదయం తన వ్యవసాయ బావి వద్దకు పాలు పితకడానికి బైక్‌పై వెళ్తున్నాడు. ఈ క్రమంలో బైక్ చెట్టును ఢీకొని గుంతలో పడి అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న ఎస్సై ఎస్‌కే అబ్దుల్ హమీద్ ఘటనా స్థలికి చేరుకుని పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని జనగామ ఏరియా ఆస్పత్రికి తరలించారు. కుటుంబీకుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. మృతుడికి భార్య లత, ఇద్దరు కుమారులు ఉన్నారు.
న్యూ ఇయర్ వేళ తీవ్ర విషాదం నెలకొంది. గురువారం ఉమ్మడి వరంగల్ జిల్లాలోని పలుచోట్ల జరిగిన వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ముగ్గురు దుర్మరణం చెందారు. దీంతో ఆయా కుటుంబాలు శోకసంద్రంలో మునిగాయి.
వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ముగ్గురి దుర్మరణం
వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ముగ్గురి దుర్మరణం


