దర్గా వద్ద జెండా ఎత్తుతుండగా..
● విద్యుదాఘాతంతో యువకుడి మృతి ● మరొకరికి తీవ్రగాయాలు ● కాళేశ్వరంలో ఘటన
కాళేశ్వరం : మొక్కులు చెల్లించుకోవడానికి సంతోషంగా వచ్చిన ఓ యువకుడు విద్యుదాఘాతంతో మృతి చెందగా మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన గురువారం జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలం కాళేశ్వరం దర్గాలో చోటు చేసుకుంది. ఎస్సై తమాషారెడ్డి కథనం ప్రకారం.. మంచిర్యాల జిల్లా చెన్నూరుకు చెందిన ఎం.ఏ. మజీద్ (32), మహమ్మద్ సమీరుద్దీన్‌తోపాటు మరికొంత మంది ముస్లింలు కాళేశ్వరంలోని మజీద్‌పల్లి దర్గా వద్ద మహ్మద్ షా వలీ జన్మదిన వేడుకల్లో (సందల్) పాల్గొని మొక్కులు చెల్లిస్తున్నారు. ఈ క్రమంలో దర్గా వద్ద జెండా ఎక్కించే కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఇనుప పైపునకు జెండాను బిగించి పైకి ఎత్తుతున్న సమయంలో ఆ పైపు..పైన ఉన్న 11 కేవీ విద్యుత్ తీగలకు తగిలింది. దీంతో ఆ పైపును పట్టుకున్న ఎం.ఏ. మజీద్, మహమ్మద్ సమీరుద్దీన్‌కు విద్యుత్ సరఫరా కావడంతో ఇద్దరూ అపస్మారక స్థితికి చేరుకున్నారు. వారిని వెంటనే స్థానికులు మహదేవపూర్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా ఎం.ఏ.మజీద్ చికిత్స పొందుతూ మృతి చెందాడు. సమీరుద్దీన్‌ను మెరుగైన వైద్యం కోసం మంచిర్యాల జిల్లా ఆస్పత్రికి తరలించారు. మృతుడికి కుమారుడు ఉన్నాడు. మృతుడి సోదరుడు మీర్జా అహ్మద్ అలీ బేగ్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. కాగా, కొత్త సంవత్సరం రోజున ఆ కుటుంబంలో విషాదం నెలకొంది.


