పకడ్బందీగా యూరియా పంపిణీ చేయాలి
● కలెక్టర్ అద్వైత్‌కుమార్‌సింగ్
మహబూబాబాద్: రైతులకు ఇబ్బంది లేకుండా పకడ్బందీగా యూరియా పంపిణీ చేయాలని కలెక్టర్ అద్వైత్‌కుమార్ సింగ్ ఆదేశించారు. కలెక్టర్ కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాల్‌లో మంగళవారం యూరియా పంపిణీపై సంబంధిత అధికారులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. పీఏసీఎస్‌ల ద్వారా అదనపు యూరియా అమ్మకాల కేంద్రాల ఏర్పాటుకు అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేయాలన్నారు. జిల్లాలో యూరియా కొరత లేనందున సవ్యంగా పంపిణీ చేయాలన్నారు. సంబంధిత అధికారులు సమన్వయంతో రైతులకు యూరియా అందజేయాలన్నారు. ఎస్పీ శబరీష్ మాట్లాడుతూ.. యూరియా పంపిణీ విషయంలో పోలీసుల నుంచి పూర్తి సహాయ సహకారాలు ఉంటాయన్నారు. కేంద్రాల వద్ద పక్కాగా క్యూలైన్లు, టెంట్లు, తాగునీరు ఏర్పాటు చేయాలన్నారు. సమావేశంలో అదనపు కలెక్టర్లు లెనిన్ వత్సల్ టొప్పో, ఆర్డీఓ గణేష్, డీఏఓ విజయనిర్మల ఉన్నారు.
యూరియా పంపిణీ పరిశీలన
బయ్యారం: మండలంలో యూరియా పంపిణీని కలెక్టర్ ఆద్వైత్‌కుమార్‌సింగ్ మంగళవారం పరిశీలించారు. బయ్యారంలోని సొసైటీ, ఆగ్రోస్, కొత్తపేటలోని సొసైటీ ఎరువుల పంపిణీ కేంద్రాలను పరిశీలించిన ఆయన సిబ్బందితో మాట్లాడారు. యూరియా పంపిణీలో రైతులకు ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఆయన వెంట ఏడీఏ శ్రీనివాసరావు, ఏఓ రాజు, సీఐ రవికుమార్ తదితరులు ఉన్నారు.


