సమన్వయంతో జాతరను విజయవంతం చేయాలి
ఎస్‌ఎస్‌తాడ్వాయి: వివిధ శాఖల అధికారులు సమన్వయంతో పని చేసి మహాజాతరను విజయవంతం చేయాలని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క అన్నారు. మంగళవారం మేడారంలో జాతర అభివృద్ధి పనులపై కలెక్టర్ దివాకర్ టీఎస్, ఎస్పీ సుధీర్ రాంనాథ్ కేకన్, పీఓ చిత్రామిశ్రాతో కలిసి అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ భక్తుల క్యూలైన్ పనుల్లో వేగం పెంచాలన్నారు. మహాజాతరలో రెప్పపాటు సమయం కూడా విద్యుత్ సరఫరాకు అంతరాయం కలగొద్దన్నారు. భక్తులకు తాగునీటి సరఫరాలో ఇబ్బందులు తలెత్తకుండా రహదారులకు ఇరువైపులా బోర్లు, చేతి పంపులు, రహదారుల జంక్షన్లలో ప్రత్యేక వైద్య శిబిరాలు ఏర్పాటు చేయాలని పేర్కొన్నారు. అంతకుముందు కాల్వపల్లి –ఊరట్టం బీటీ నిర్మాణ పనులు, ఊరట్టం– కొండాయి రోడ్డు పనులు, గద్దెల ప్రాంగణంలో గ్రానైట్ ఫ్లోరింగ్ పనులు పరిశీలించి త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు. కార్యక్రమంలో డీఎఫ్‌ఓ రాహుల్ కిషన్ జాదవ్, అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) సంపత్ రావు, గ్రంథాలయ సంస్థ చైర్మన్ బానోత్ రవిచందర్, మార్కెట్ కమిటీ చైర్‌పర్సన్ రేగ కల్యాణి, ఆర్డీవో వెంకటేష్, డీఎస్పీ రవీందర్ పాల్గొన్నారు.
పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క
మేడారం అభివృద్ధి పనులపై సమీక్ష


