పంట పొలాల్లో పులి పాదముద్రలు
● పశువుల కాపరులు అప్రమత్తంగా ఉండాలని
అటవీశాఖ అధికారుల సూచన
ములుగు రూరల్: ములుగు జిల్లా మల్లంపల్లి మండలం పందికుంట పంట పొలాల్లో పులి సంచారం సోమవారం స్థానికంగా కలకలం రేపింది. ఈ మేరకు పులి పాదముద్రలను అటవీశాఖ అధికారులు గుర్తించారు. ఈ సందర్భంగా అటవీశాఖ రేంజ్ అధికారి డోలి శంకర్ మాట్లాడుతూ భూపాలపల్లి అటవీ ప్రాంతం నుంచి ములుగు మండలం జాకారం సమీపంలో ఆదివారం రాత్రి సమయంలో పెద్దపులి రోడ్డు దాటుతున్న సమయంలో 108 డ్రైవర్ గమనించి అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారని తెలిపారు. ములుగు, అబ్బాపూర్, జాకారం, పందికుంట బీట్లలో అటవీశాఖ అధికారులు బీట్ టీంలతో కలిసి పులి జాడను పరిశీలించారు. పందికుంట శివారులో మిర్చి తోటలో పులి పాదముద్రలు గుర్తించామన్నారు. మదనపల్లి, జగ్గన్నపేట, పత్తిపల్లి, పొట్లాపూర్, పంచోత్కులపల్లి, రాయినిగూడెం, సర్వాపూర్ గ్రామ శివారులో పులి సంచరించే అవకాశం ఉందని తెలిపారు. వ్యవసాయ పనులకు వెళ్లె కూలీలు, పశువుల కాపరులు అటవీ ప్రాంతాల్లోకి వెళ్లొద్దని సూచించారు. పులి కనిపిస్తే అటవీశాఖ అధికారులకు సమాచారం అందించాలని, ఎవరైనా హాని తలపెడితే వైల్డ్ లైఫ్ యాక్ట్ ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
పంట పొలాల్లో పులి పాదముద్రలు


