మేడారం జాతరపై పీఓ సమీక్ష
● పాల్గొన్న పూజారులు, ఆదివాసీ సంఘాలు
ఏటూరునాగారం : జనవరి 28 నుంచి 31వ తేదీ వరకు జరగనున్న మేడారం మహాజాతరపై ఐటీడీఏ పీఓ చిత్రామిశ్రా సోమవారం ఆదివాసీ సంఘాలు, మేడారం సమ్మక్క, సారలమ్మ పూజారులతో సమీక్షించారు. జాతరను కనివిని ఎరుగని రీతిలో నిర్వహించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోందని, దీనికి అనుగుణంగా సలహాలు, సూచనలు ఇవ్వాలని పూజారులు, ఆదివాసీ సంఘాలు, వడ్డెలను కోరారు. కోళ్లు, మద్యం, బెల్లం, కొబ్బరికాయల షాపుల కేటాయింపు విషయంలో వారి అభిప్రాయాలు సేకరించారు. ఆదివాసీ సంఘాల్లోని సమస్యలు, జాతర సమయంలో పూజారులకు ఎదురయ్యే ఇబ్బందులపై చర్చించారు. ఎక్కడ, ఎలాంటి లోటుపాట్లు తలెత్తకుండా చర్యలు తీసుకోవడానికి అధికార యంత్రాంగం సిద్ధంగా ఉందని పీఓ తెలిపారు. కాగా, మేడారం గద్దెల వద్ద జరుగుతున్న అభివృద్ధి పనులు మరింత వేగవంతం చేయాలని పూజారులు పీఓను కోరారు. కార్యక్రమంలో పూజారుల సంఘం అధ్యక్షుడు సిద్ధబోయిన జగ్గారావు, ఏపీఓ వసంతరావు, డీడీ జనార్ధన్, జీసీసీ డీఎం వాణి, ఎస్‌ఓ రాజ్‌కుమార్, మేనేజర్ శ్రీనివాస్ పాల్గొన్నారు.


