పీఆర్సీని వెంటనే అమలు చేయాలి
జనగామ రూరల్: అన్ని రకాల పెండింగ్ బిల్లులను మంజూరు చేసి వెంటనే పీఆర్సీని అమలు చేయాలని, లేని పక్షంలో ఉద్యమ కార్యాచరణ ప్రకటిస్తామని టీఎస్ యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు చావ రవి డిమాండ్ చేశారు. పట్టణంలో రెండు రోజులపాటు నిర్వంచిన రాష్ట్ర విద్యా సదస్సు సోమవారం ముగిసింది. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యా వ్యవస్థలో ఎన్జీఓల జోక్యం నిరోధించాలని, శిక్షణల పేరిట బోధన సమయాన్ని హరించడం సరికాదన్నారు. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎ.వెంకట్ మాట్లాడుతూ పాఠశాల విద్యాశాఖలో కొనసాగుతున్న ట్రైనింగ్‌లు, (ఉన్నతి, ఎఫ్‌ఎల్‌ఎస్, లక్ష్య, ఎఫ్‌ఆర్‌ఎస్) ఇతర కార్యక్రమాల పేరుతో విద్యా బోధనలకు ఆటంకంగా ఉన్న విధానాలపై సమీక్షించాలని డిమాండ్ చేశారు. కేజీబీవీ, మోడల్ స్కూల్ గురుకులాల సమస్యలను పరిష్కరించాలన్నారు. కాగా, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో పరిష్కరించాల్సిన విద్యారంగ, ఉపాధ్యాయుల సమస్యలపై 25 తీర్మానాలను ప్రవేశపెట్టారు. కార్యక్రమంలో సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు కె.జంగయ్య, చావ దుర్గాభవాని, కోశాధికారి టి.లక్ష్మారెడ్డి, రాష్ట్ర కార్యదర్శులు కె.సోమశేఖర్, ఎం.రాజశేఖర్‌రెడ్డి, డి.సత్యానంద్, జి.నాగమణి, కె.రంజిత్ కుమార్, ఎస్.మల్లారెడ్డి, జి.శ్రీధర్, ఆడిట్ కమిటీ కన్వీనర్ జె. యాకయ్య, జనగామ జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు పి.చంద్రశేఖర్‌రావు, మడూరు వెంకటేష్, జిల్లా నాయకులు ఆకుల శ్రీనివాసరావు, కృష్ణ, మంగుజయప్రకాశ్, హేమలత, శ్రీనివాస్, కృష్ణమూర్తి, కందుల శ్రీనివాస్ పాల్గొన్నారు.
జాప్యం జరిగితే ఉద్యమ కార్యాచరణ ప్రకటిస్తాం
టీఎస్ యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు
చావ రవి
ముగిసిన రాష్ట్ర విద్యాసదస్సు


