5లోగా విద్యుత్ పనులు పూర్తి
ఎస్‌ఎస్ తాడ్వాయి : మేడారం మహాజాతరలో చేపడుతున్న విద్యుత్ పనులన్నీ వచ్చే నెల 5వ తేదీలోగా పూర్తి చేయాలని టీజీ ఎన్పీడీసీఎల్ సీఎండీ కర్నాటి వరుణ్‌రెడ్డి ఆదేశించారు. ఈ మేరకు సోమవారం మేడారంలో జరుగుతున్న విద్యుత్ పనులు పరిశీలించి మాట్లాడారు. గట్టమ్మ ఆలయం వద్ద కొత్తగా నిర్మిస్తున్న 33/11 కేవీ సబ్‌స్టేషన్ త్వరగా అందుబాటులోకి తీసుకురావాలన్నారు. భక్తులకు ఎలాంటి విద్యుత్ అసౌకర్యం కలగకుండా ముందుగానే పనులన్నీ పూర్తి చేయాలన్నారు. నార్లాపూర్‌లోని 33 /11 కేవీ సబ్‌స్టేషన్ సందర్శించి జనవరి 10వ తేదీలోగా పూర్తి చేయాలని పేర్కొన్నారు. ప్రత్యామ్నాయ విద్యుత్ సరఫరా కోసం మేడారం ఆలయం వద్ద ఏర్పాటు చేసిన స్తంభాల ఏర్పాటు పనులను పరిశీలించి నిర్దేశిత సమయం కల్లా పూర్తి చేయాలన్నారు. మేడారం, వెంగళాపూర్, చింతల్ క్రాస్ రోడ్డు, నార్లాపూర్ పార్కింగ్ స్థలాలను పరిశీలించి విద్యుత్ ఏర్పాట్లపై పలు సూచనలు చేశారు. అనంతరం ఊరట్టం స్తూపం జంక్షన్, హరిత హోటల్ జంక్షన్, ఆర్టీసీ బస్టాండ్, కన్నెపల్లి రోడ్డు ప్రాంతాలను క్షుణ్ణంగా పరిశీలించారు. చీఫ్ ఇంజనీర్ రాజుచౌహాన్, ఎస్‌ఈ ఆనందం, డీఈ నాగేశ్వర్‌రావు పాల్గొన్నారు.
ఎన్పీడీసీఎల్ సీఎండీ వరుణ్‌రెడ్డి
మేడారంలో విద్యుత్ పనుల పరిశీలన


