మల్లన్న ఆలయంలో నిలువు దోపిడీ
ఐనవోలు: ప్రఖ్యాత ఐనవోలు మల్లికార్జునస్వామి ఆలయంలో భక్తులను ఒగ్గు పూజారులు నిలువు దోపిడీకి గురి చేస్తున్నారని భక్తుడు ఆరోపిస్తూ ఆలయ కార్యనిర్వహణ అధికారికి ఫిర్యాదు చేశాడు. వివరాల్లోకి వెళితే.. యాదాద్రి భువనగిరి జిల్లాకు చెందిన రాంకుమార్‌రెడ్డి తన కుటుంబ సభ్యులతో కలిసి ఆదివారం ఉదయం ఐనవోలు మల్లికార్జునస్వామి ఆలయానికి మొక్కులు చెల్లించుకోవడానికి వచ్చాడు. ముందుగా ఆలయం లోపల పట్నం వేయడానికి కౌంటర్ వద్ద రూ.300 టికెట్ కొనుక్కొని ఆలయం లోపల పట్నాలు వేసే ప్రదేశానికి వెళ్లాడు. భక్తుల రద్దీ అధికంగా ఉండడంతో ఒగ్గు పూజారులు సామూహికంగా పట్నాలు వేయిస్తున్నారు. ఈ క్రమంలో రాజేశ్ అనే ఒగ్గు పూజారి రాంకుమార్‌రెడ్డి వద్దకు వెళ్లి టికెట్ తీసుకుని రూ.700 ఇవ్వాలని డిమాండ్ చేశాడు. డబ్బు ఎందుకు ఇవ్వాలని ఒగ్గు పూజారిని భక్తుడు ప్రశ్నించడంతో పట్నం, పూజ మధ్యలోనే ఆపివేసి వెళ్లిపోయాడు. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన భక్తుడు ఆగ్రహానికి గురై అధికారులకు ఫిర్యాదు చేశాడు. అనంతరం ఆలయ సిబ్బంది మరో ఒగ్గు పూజారితో భక్తుడి పట్నం మొక్కులను పూర్తిచేయించారు. ఈ విషయంపై ఈఓ కందుల సుధాకర్‌ను వివరణ కోరగా ఇటీవల ఒగ్గు పూజారులు, కల్యాణకట్ట సిబ్బందితో సమావేశం ఏర్పాటు చేసి భక్తుల వద్ద నుంచి కానుకలు ఆశించవద్దని స్పష్టం చేసినట్లు తెలిపారు. ఆదివారం భక్తుడితో అనుచితంగా ప్రవర్తించి డబ్బులు ఇవ్వాలని డిమాండ్ చేసిన ఒగ్గు పూజారిని 15 రోజులు ఆలయానికి రాకుండా ఆదేశాలు ఇచ్చానన్నారు. రెండు రోజుల్లో ఆలయ చైర్మన్‌తో కలిసి మరో సమావేశం ఏర్పాటు చేసి, భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా చర్యలు తీసుకుంటానని తెలిపారు.
డబ్బులు ఇవ్వలేదని పూజ మధ్యలోనే వెళ్లిపోయిన ఒగ్గు పూజారి
15 రోజులు విధులకు రావొద్దని
ఒగ్గు పూజారికి ఈఓ ఆదేశాలు


