నేటి నుంచి యాప్ ద్వారానే యూరియా పంపిణీ
మహబూబాబాద్ రూరల్ : యూరియా పంపిణీకి ఫెర్టిలైజర్ బుకింగ్ యాప్ సేవలను ప్రారంభిస్తున్నామని డివిజన్ వ్యవసాయ సహాయ సంచాలకుడు అజ్మీరా శ్రీనివాసరావు అన్నారు. జిల్లా కేంద్రంలోని రైతు వేదిక కార్యాలయంలో మండలంలోని ఎరువుల డీలర్లకు ఫెర్టిలైజర్ యూరియా బుకింగ్ యాప్ పని విధానంపై ఆదివారం ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఫెర్టిలైజర్ బుకింగ్ యాప్ వినియోగంలో జిల్లాను పైలట్ ప్రాజెక్టుగా యూరియా సరఫరాకు ఎంపిక చేశారన్నారు. ఇకనుంచి రైతులు యూరియా కోసం ఇబ్బందిపడకుండా వ్యవసాయ శాఖ రూపొందించిన ఫెర్టిలైజర్ బుకింగ్ యాప్ తీసుకొచ్చిందని తెలిపారు. ఈ యాప్ ద్వారా రైతులు తమ ఇంటి వద్ద నుంచే జిల్లాలో అన్ని ఎరువుల దుకాణాల్లో అందుబాటులో ఉన్న యూరియాను సాగుచేసే పంటలకు బుకింగ్ చేసుకుని పొందవచ్చన్నారు. యూరియా అవసరమున్న రైతులు గూగుల్ ప్లే స్టోర్ నుంచి ఫెర్టిలైజర్ బుకింగ్ యాప్ డౌన్ లోడ్ చేసుకొని రైతు లాగిన్‌లో తమ పంటల సాగు వివరాలు నమోదు చేసి తమకు అందుబాటులో యూరియా ఉన్న డీలర్ వద్ద పొందవచ్చని తెలిపారు. సందేహాలు ఏమైనా ఉంటే మండల వ్యవసాయ అధికారి, వ్యవసాయ విస్తరణ అధికారులను సంప్రదించాలని సూచించారు. సమావేశంలో మండల వ్యవసాయ అధికారి నారెడ్డి తిరుపతిరెడ్డి, వ్యవసాయ విస్తరణ అధికారులు బెల్లంకొండ సాయిప్రకాష్, రెడ్యానాయక్, డీలర్లు పాల్గొన్నారు.


