యూరియా కోసం రైతుల బారులు
క్యూలో నిరీక్షిస్తున్న మహిళలు
కాంపల్లి సొసైటీ వద్ద యూరియా కోసం బారులుదీరిన రైతులు
కురవి: సీరోలు మండలం కాంపల్లి గ్రామంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం(సొసైటీ) వద్ద ఆదివారం యూరియా కోసం రైతులు బారులుదీరారు. రైతులు అధిక సంఖ్యలో తరలిరాగా.. ఒక రైతుకు ఒక బస్తా యూరియా మాత్రమే ఇస్తుండడంతో తోపులాట జరిగింది. గతంలోనే ప్రతీ రైతుకు గుర్తింపు కార్డును అధికారులు అందించారు. ఆ కార్డు పట్టుకుని యూరియా కోసం సొసైటీ వద్దకు రైతులు తరలివచ్చారు. యూరియా పంపిణీ సమయంలో క్యూలో ఉన్న రైతులు ఒకరినొకరు తోచుకోవడంతో స్వల్పంగా ఉద్రిక్తత నెలకొంది. మహిళలు సైతం అధిక సంఖ్యలో యూరియా కోసం తరలివచ్చారు. రెండు క్యూ ల్లో రైతులు ఎక్కువగా ఉండడం, పోలీసు సిబ్బంది లేకపోవడంతో ఇబ్బంది నెలకొంది. భద్రాచలంలో జరిగే ఆధ్యాత్మిక కార్యక్రమానికి సీరోలు పోలీసులు బందోబస్తు నిమిత్తం వెళ్లడంతో యూరియా పంపిణీలో పోలీసుల బందోబస్తు తక్కువగా ఉంది. దీంతో రైతులు ఎవరిమాట వినే పరిస్థితిలో లేకుండా పోయారు. ఒకే బస్తా పంపిణీ చేస్తుండడంతో మండిపడ్డారు. యాసంగి వరికు, మొక్కజొన్న సాగుకు ఒక్క బస్తా యూరియా సరిపోదని పలువురు రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. సొసైటీ వద్ద తోపులాట జరగడంతో సమాచారం అందుకున్న సీరోలు ఎస్సై సంతోష్ అదనపు సిబ్బందిని అక్కడికి పంపించడంతో రైతులు శాంతించారు. విషయం తెలుసుకున్న ఏఓ చాయారాజ్ సంఘటన స్థలానికి చేరుకున్నారు. కురవి మండల కేంద్రంతోపాటు నేరడ, గుండ్రాతిమడుగు(విలేజి) సొసైటీల్లో రైతులకు యూరియా పంపిణీ చేశారు.
ఒకరికి ఒకే బస్తా పంపిణీ
రైతుల తోపులాట
యూరియా కోసం రైతుల బారులు


