46 ఏళ్ల తర్వాత కలిసిన స్నేహితులు
దంతాలపల్లి: 46 సంవత్సరాల క్రితం కలిసి చదువుకున్న మిత్రులు విద్యార్థి దశ తర్వాత వేర్వేరు చోట్ల స్థిరపడ్డారు. కానీ, తమ చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకునేందుకు మరోసారి కలిశారు. ఆరుపదుల వయస్సులో ఉన్నవారంతా కలిసుకునేందుకు తాము చదువుకున్న పాఠశాలనే వేదిక చేసుకున్నారు. మండలంలోని పెద్దముప్పారంలో 1979లో ఏడో తరగతి పూర్తి చేసిన నాటి విద్యార్థులు ఆదివారం అదే పాఠశాలలో కలుసుకున్నారు. చిన్నతనంలో తాము చదివిన, ఆడుకున్న బడి ఆవరణలో నాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకుని మురిసిపోయారు. కార్యక్రమంలో సర్పంచ్ కందిమల్ల భరత్ బాబు, అప్పటి గురువులు గోపిరెడ్డి, సోమిరెడ్డి, ఎంఈఓ శ్రీదేవి, పూర్వ విద్యార్థులు అశోక్‌రెడ్డి, సమ్మయ్య, మార్కండేయ, జ్యోతి, రజియా బేగం, కర్ని వెంకన్న, ముత్యం వెంకన్న పాల్గొన్నారు.


