జీఓ నంబర్ 252ను సవరించాలి
హన్మకొండ అర్బన్: రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల విడుదల చేసిన జీఓ నంబర్ 252ను సవరించి రాష్ట్ర ప్రభుత్వం గుర్తింపు వచ్చే అక్రిడిటేషన్ కార్డును గతంలో మాదిరిగానే డెస్క్ జర్నలిస్టుందరికీ ఇవ్వాలని డెస్క్ జర్నలిస్టు ఫెడరేషన్ ఆఫ్ తెలంగాణ (డీజేఎఫ్‌టీ) నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు డీజేఎఫ్‌టీ ఆధ్వర్యంలో శనివారం హనుమకొండ, వరంగల్ కలెక్టరేట్ల ఎదుట నిరసన ప్రదర్శన, రాస్తారోకో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి టీయూడబ్ల్యూజే (143)తోపాటు వివిధ జర్నలిస్టు సంఘాలు మద్దతు పలికాయి. ఈ సందర్భంగా డెస్క్ జర్నలిస్టులు మాట్లాడుతూ ఇటీవల వెలువడిన జీఓ 252 అసంబద్ధం, లోపభూయిష్టంగా ఉందన్నారు. డెస్క్ జర్నలిస్టుల న్యాయబద్ధమైన హక్కును హరించేదిగా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. వార్త సేకరణలో విలేకరుల ఎంత కష్టపడతారో.. అంతకన్నా ఎక్కువ కష్టం డెస్క్ జర్నలిస్టు పడతాడని తెలిపారు. ఇలా ఒకే పనివిధానం ఉన్న వారిని వేర్వేరుగా చూడడం సరికాదన్నారు. రాష్ట్ర ప్రభుత్వం స్పందించి 252జీఓను రద్దు చేసి పాత పద్ధతిలోనే అక్రిడిటేషన్ కార్డులు ఇవ్వాలన్నారు. అనంతరం హనుమకొండ కలెక్టర్ స్నేహ శబరీష్, వరంగల్ డీఆర్‌ఓ విజయలక్ష్మికి వినతిపత్రాలు అందించారు. ఆయా కార్యక్రమాల్లో డీజేఎఫ్‌టీ నాయకులు వర్ధెల్లి లింగయ్య, శంకేసి శంకర్‌రావు, టీయూడబ్ల్యూజీఏ (143) నాయకులు బీఆర్. లెనిన్, చిలుముల సుధాకర్, కక్కెర్ల అనిల్ కుమార్‌గౌడ్,, తడక రాజ్‌నారాయణ, అర్షం రాజ్‌కుమార్, కోరుకొప్పుల నరేందర్, వాంకే శ్రీనివాస్, పొగుకుల అశోక్, నవీన్, డెస్క్ జర్నలిస్టులు పాల్గొన్నారు.
డెస్క్ జర్నలిస్టు ఫెడరేషన్ ఆఫ్ తెలంగాణ డిమాండ్
హనుమకొండ, వరంగల్ కలెక్టరేట్ల
ఎదుట ఆందోళన


