ఉడకని అన్నం.. రుచిలేని కూరలు
కేయూ క్యాంపస్ : కాకతీయ యూనివర్సిటీలోని న్యూ పీజీ బాయ్స్ హాస్టల్ మెస్‌లో భోజనం నాణ్యతగా ఉండటం లేదని, దీనిపై పలుమార్లు విన్నవించినా హాస్టళ్ల డైరెక్టర్ పట్టించుకోవడం లేదని శనివారం మధ్యాహ్నం ఆ హాస్టల్ విద్యార్థులు ఉడకని అన్నం తీసుకొచ్చి మొదటి గేట్‌వద్ద వద్ద ధర్నా నిర్వహించారు. స్టీమ్‌పై వంట చేయడంతో అన్నం సరిగా ఉడకడం లేదని, అలాగే కూరలు కూడా నాణ్యతగా ఉండడం లేదన్నారు. దీంతో తాము ఎలా తినాలని నిరసన తెలిపారు. సమాచారం అందుకున్న కేయూ ఇన్‌చార్జ్ రిజిస్ట్రార్, పరీక్షల నియంత్రణాధికారి కె. రాజేందర్, హాస్టళ్ల డైరెక్టర్ ఎల్.పి రాజ్‌కుమార్.. ఘటనాస్థలికి చేరుకున్నారు. దీంతో వారితో విద్యార్థులు వాగ్వాదానికి దిగారు. హాస్టళ్ల డైరెక్టర్ దృష్టికి సమస్యలను తీసుకెళ్లినా పట్టించుకోవడం లేదని, కేర్ టేకర్ కూడా సరిగా ఉండడం లేదని ఆరోపించారు. కూరల్లో కారం, పసుపు, మసాలా అధిక స్థాయిలో వేస్తున్నారని, తద్వారా తినలేకపోతున్నామని పలువురు విద్యా ర్థులు ఆరోపించారు. మెస్‌లోకి వచ్చి పరిశీలించాలని పరీక్షల నియంత్రణాధికారి రాజేందర్‌ను కోరారు. దీనిపై స్పందించిన రాజేందర్.. సమస్యను రెండు రోజుల్లో పరిష్కరిస్తారనని విద్యార్థులకు హామీ ఇచ్చారు. సరిగా వండాలని సంబంధిత వర్కర్లకు చెబుతామని, వారు సరిగా చేయకపోతే మార్చుతామని తెలిపారు.
న్యూపీజీ హాస్టల్‌మెస్‌ను సందర్శించిన
ఇన్‌చార్జి రిజిస్ట్రార్..
విద్యార్థుల ఆందోళన నేపథ్యంలో హాస్టళ్ల డైరెక్టర్ రాజ్‌కుమార్‌తో కలిసి ఇన్‌చార్జ్ రిజిస్ట్రార్, పరీక్షల నియంత్రణాధికారి ఆచార్య కె. రాజేందర్ క్యాంపస్‌లోని న్యూ పీజీ బాయ్స్ హాస్టల్ మెస్‌ను సందర్శించి పరిశీలించారు. అక్కడి వర్కర్లతో మాట్లాడి వంటలు సరిగా చేయాలన్నారు. లేనిపక్షంలో మా ర్చుతామని హెచ్చరించారు. అలాగే, మెస్ కమిటీలో ఉన్నవారు ఎప్పటికప్పుడు అన్నం, కూరల నాణ్యతను పరిశీలించుకోవాలన్నారు.
అధికారుల తీరుపై న్యూపీజీ హాస్టల్ విద్యార్థుల ఆగ్రహం
ఉడకని అన్నం తీసుకొచ్చి
మొదటి గేట్ వద్ద ఆందోళన
నాణ్యమైన భోజనం అందించాలని డిమాండ్


