రాష్ట్ర సదస్సుకు జనగామ ముస్తాబు..
జనగామ రూరల్: రెండు రోజుల పాటు జరగనున్న తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ విద్యా సదస్సు విస్తృత స్థాయి సమావేశాలకు జనగామ ముస్తాబైంది. పట్టణ ప్రారంభం పెంబర్తి కాకతీయ తోరణం, యశ్వాంతాపూర్ శివారులో స్వాగతం పలుకుతూ ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. జిల్లా కేంద్రంలోని మాంగళ్య ఫంక్షన్ హాల్‌లో 28, 29 తేదీల్లో విద్యా సదస్సులు జరగనున్నాయి. ఈ సందర్భంగా రాష్ట్ర కార్యదర్శి కానుగంటి రంజిత్ కుమార్ శనివారం విలేకరులతో మాట్లాడుతూ ఈ సమావేశాలు రాష్ట్ర ప్రభుత్వ విద్యారంగ దశ, దిశను మార్చేవిగా నిలుస్తాయన్నారు. ఉపాధ్యాయ సమస్యలపై చర్చించి పరిష్కారం కోసం భవిష్యత్ కార్యాచరణ చేపట్టనున్నట్లు తెలిపారు. ఆదివారం ఉదయం 9.30గంటలకు జిల్లా కేంద్రంలోని నెహ్రూ పార్కు నుంచి సమావేశాలు జరిగే సయ్యద్ జియాఉద్దీన్ ప్రాంగణం (మాంగళ్య ఫంక్షన్ హాల్) వరకు ర్యాలీ కొనసాగుతుందన్నారు. అనంతరం సభ ప్రారంభం అవుతుందన్నారు. ఈ ప్రారంభ సమావేశంలో రాష్ట్ర మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ధనసరి సీతక్క, కొండా సురేఖ ముఖ్య అతిథులుగా పాల్గొననున్నార న్నారు. విద్యా సదస్సుల్లో డాక్టర్ కె. నాగేశ్వర్, మాడభూషి శ్రీధర్ వివిధ అంశాలపై కీలకోపన్యాసాలు చేస్తారన్నారు. రెండో రోజు సోమవారం ప్రతినిధుల సమావేశం జరుగుతుందన్నారు. ఈ సమావేశాల్లో రాష్ట్ర వ్యాప్తంగా 33 జిల్లాల నుంచి సంఘం ప్రతినిధులు 500 మంది పాల్గొంటారని వివరించారు. రాష్ట్ర కమిటీ సభ్యులు శ్రీనివాస్ రావు, జిల్లా అధ్యక్షుడు చంద్రశేఖర్ రావు, ప్రధాన కార్యదర్శి మడూరి వెంకటేష్, ఉపాధ్యక్షుడు మంగు జయప్రకాశ్, కోశాధికారి చిక్కుడు శ్రీనివాస్, సభల ఆహ్వాన సంఘం గౌరవ అధ్యక్షుడు తాడూరి శ్రీనివాస్ పాల్గొన్నారు.
రెండు రోజుల పాటు యూటీఎఫ్
రాష్ట్ర విద్యాసమావేశాలు
హాజరుకానున్న 500 మంది ప్రతినిధులు


