యూరియా జపం..
యాసంగి వరి సాగుకు సిద్ధమైన రైతులు
సాక్షి, మహబూబాబాద్: వానాకాలంలో యూరియా కోసం పడరాని పాట్లుపడిన రైతులకు యాసంగిలోనూ తిప్పలు తప్పడం లేదు. వరి సాగుకు సిద్ధమైన రైతులు యూరియా కోసం వెళ్తే ఫర్టిలైజర్ షాపులు, పీఏసీఎస్‌ల వద్ద దొరకడం లేదు. వచ్చిన యూరియాను సక్రమంగా పంపిణీ చేయకపోవడంతో పీఏసీఎస్‌ల వద్ద రైతులు క్యూలో పడిగాపులు పడుతున్నారు. యూరియా పంపిణీలో సరైన విధి విధానాలు లేవని, వ్యవసాయశాఖ, పీఏసీఎస్ అధికారుల మధ్య సమన్వయం లేకపోవడంతో ఇబ్బందులు పడాల్సి వస్తోందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
యాసంగి సాగు ముందుకు..
యాసంగిలో 25,55,27 ఎకరాల్లో వివిధ రకాల పంటలు సాగయ్యే అవకాశం ఉందని వ్యవసాయ శాఖ అధికారులు ప్రణాళిక ఖరారు చేశారు. వరి 16,41,24 ఎకరాలు, మొక్కజొన్న 84,261 ఎకరాలు, పెసర 2,879 ఎకరాలు, మినుములు 394 ఎకరాలు, జొన్న 1,565 ఎకరాలు, వేరుశనగ 1,043 ఎకరాలు, బొబ్బెర 1,261 ఎకరాల్లో సాగవుతుందని అంచనా వేశారు. ఈ లెక్కల ప్రకారం ఇప్పటికే మొక్కజొన్న సాగు చేశారు. వరి నార్లుపోసి నాట్లు వేస్తున్నారు. ఇతర పంటల సాగుకు సిద్ధం అవుతున్నారు.
కార్డులు పంపిణీ చేసినా..
వానాకాలం సీజన్‌లో యూరియా కోసం రైతులు పడిన ఇబ్బందులు తొలగించేందుకు కలెక్టర్, ఎస్పీ నేతృత్వంలో పీఏపీఎస్, వ్యవసాయశాఖ అధికారులతో సమీక్షలు నిర్వహించారు. రైతులు సాగుచేసిన పంటలకు కావాల్సిన యూరియా ఇవ్వాలి. అధికంగా ఇవ్వడంతోనే కొరత వస్తుందని భావించారు. దీనికి అడ్డుకట్ట వేసేందుకు పంటల నమోదు, సమగ్ర ఎరువుల యాజమాన్యం కార్డులు తయారు చేశారు. ఇందులో రైతుల పేర్లు, సాగు వివరాలు పొందుపరిచి వాటి ద్వారా యూరియా పంపిణీ చేయాలని భావించారు. ఎకరాకు వరికి మూడు, మొక్కజొన్నకు ఐదు, మిర్చికి ఆరు బస్తాల చొప్పున యూరియా సరఫరా చేయాలని నిర్ణయించారు. ఇందుకోసం 2.24లక్షల కార్డులను తయారు చేశారు. అయితే ఈ కార్డులను కొన్ని ప్రాంతాల్లోనే పంపిణీ చేసినట్లు సమాచారం. మిగిలిన ప్రాంతాల్లో కార్డులు సరఫరా చేయకపోవడం, ఆన్‌లైన్‌లో యూరియా బుకింగ్ చేసుకోవచ్చనే ప్రకటనలు రావడంతో రైతులు అయోమయానికి గురవుతున్నారు.
యూరియా
దొరకడం లేదు
రెండు ఎకరాల్లో మొక్కజొన్న సాగుచేశాను. నెలరోజులుగా యూరియా కోసం పీఏసీఎస్ అధికారుల చుట్టూ తిరుగుతున్నాను. ఎవరూ సరైన సమాధానం చెప్పడం లేదు. శుక్రవారం యూరియా వచ్చిందని తెలియగానే మహబూబాబాద్‌కు వచ్చాను. అప్పటికే పొడుగూత నిలబడ్డారు. రైతులకు సరిపడా యూరియా సరఫరా చేయాలి.
– తేజావత్ భద్రు, ఆబుతండా
యూరియా కొరత లేదు
వానాకాలంలో యూరియా సరఫరాలో జరిగిన ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని యాసంగిలో రైతులకు ఇబ్బందులు కలగకుండా ప్రణాళిక సిద్ధ చేశాం. ఇందుకోసం రైతులకు కార్డులు సరఫరా చేశాం. ఇప్పటికే సాగుచేసిన మొక్కజొన్న రైతులకు యూరియా ఇస్తున్నాం. జిల్లాలో ఎక్కడ కూడా యూరియా కొరత లేదు. కొరతపై వచ్చే వదంతులను నమ్మకండి.
– విజయ నిర్మల, డీఏఓ
దిగుమతిలో జాప్యం
యాసంగి సీజన్ ప్రారంభం నుంచి అంటే అక్టోబర్ నుంచే యూరియా దిగుమతి కోసం అధికారులు అంచనాలు వేశారు. ఇందుకు అనుగుణంగానే ప్రభుత్వానికి ఇండెంట్ పెట్టారు. ఇలా అక్టోబర్ నుంచి డిసెంబర్ వరకు 34,780 మెట్రిక్ టన్నులు అవసరం కాగా ఇప్పటి వరకు 15,345 మెట్రిక్ టన్నులు మాత్రమే రైతులకు సరఫరా చేశారు. మిగిలిన యూరియా దిగుమతిలో జాప్యం కావడంతో యూరియా కొరత ఏర్పడిందని వ్యవసాయశాఖలోని పలువురు అధికారులు చెబుతున్నారు.
వ్యవసాయ, సహకార శాఖల మధ్య సమన్వయ లోపంతో ఇబ్బందులు
పీఏసీఎస్‌ల వద్ద రైతుల పడిగాపులు
సరిపడా సరఫరా చేయాలని డిమాండ్
యూరియా జపం..


