రైతు వేదిక.. నిర్వహణ లేక
తొర్రూరు: నిర్వహణ నిధులు లేక రైతు వేదికలు నిస్తేజంగా మారుతున్నాయి. 39 నెలలుగా ఒక్క రూపాయి కూడా రాకపోవడంతో ఏఈఓలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కనీస సదుపాయాలు లేక ఈ వేదికలకు వచ్చే అన్నదాతలు అవస్థలు పడుతున్నారు. కొంత మంది ఏఈఓలు తమ సొంత డబ్బులతో రైతు వేదిక నిర్వహణ చూసుకుంటున్నారు. రెండున్నరేళ్లకు పైగా విద్యుత్ బిల్లులు చెల్లించకపోవడంతో కనెక్షన్లు ఎప్పుడు తొలగిస్తారో తెలియని పరిస్థితి ఏర్పడింది.
ఆరంభంలో ఆర్భాటం..
పంటల సాగుపై అన్నదాతలకు సూచనలు, సలహాలు, శిక్షణ తరగతుల నిర్వహణ, తదితర లక్ష్యాల కోసం జిల్లా వ్యాప్తంగా 82 రైతు వేదికలు నిర్మించారు. ప్రతీ ఐదు వేల మంది కర్షకులకు, రెండు నుంచి నాలుగు గ్రామాలకు కలిపి ఒక క్లస్టర్‌ను ఏర్పాటు చేశారు. ఒక్కోదానికి వ్యవసాయ శాఖ ద్వారా రూ.12 లక్షలు, ఉపాధిహామీ పథకం కింద రూ.10 లక్షలు వెచ్చించి నిర్మించారు. ఒక్కో వేదిక నిర్వహణకు ఒక ఏఈఓను నియమించారు. పంటల సాగుపై శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నా.. రైతు వేదికల నిర్వహణకు నిధుల్లేక ఏఈఓలకు భారంగా మారాయి.
39 నెలలుగా అందని నిధులు..
గత ప్రభుత్వ హయాంలో ప్రతీ వ్యవసాయ డివిజన్‌కు ఒక రైతు వేదికను నిర్మించారు. మొదట్లో ఒక్కోదాని నిర్వహణకు నెలకు రూ.3 వేలు ఇచ్చారు. ఆ నిధులు సరిపోకపోవడంతో వ్యవసాయ శాఖ ప్రతిపాదనల మేరకు 2020 ఏప్రిల్ నుంచి రూ.9 వేల చొప్పున అందజేస్తామని అప్పటి ప్రభుత్వం ప్రకటించింది. 2022 ఆగస్టులో 5 నెలలకు కలిపి ఒక్కో రైతు వేదికకు రూ.45 వేల చొప్పున నిధులు విడుదల చేశారు. తర్వాత 39 నెలలుగా ఒక్క రూపాయి ఇవ్వలేదు. జిల్లాలో ఒక్కో రైతు వేదికకు రూ.3.51 లక్షల చొప్పున బకాయిలు రావాల్సి ఉంది. జిల్లా వ్యాప్తంగా రూ.2.87 కోట్ల బకాయిలు విడుదల కావాల్సి ఉంది. విద్యుత్ బిల్లులు, పారిశుద్ధ్య నిర్వహణ, మరమ్మతులు, స్టేషనరీ, రైతు శిక్షణలు, తాగునీటి సదుపాయం తదితరాలకు ఏఈఓలే తమ వేతనాల నుంచి భరిస్తూ ఆర్థిక ఇబ్బందులకు గురవుతున్నారు. ఒక్కోదానికి రూ.12 వేల నుంచి రూ.15 వేల వరకు విద్యుత్ బిల్లుల బకాయిలు పేరుకుపోయాయని ఏఈఓలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
39 నెలలుగా నిలిచిన నిధులు
పెండింగ్‌లో రూ.2.87 కోట్ల బకాయిలు
ఏఈఓలకు గుదిబండగా వేదికలు


