అమ్మవార్లకు మొక్కులు
ఎస్‌ఎస్‌తాడ్వాయి: మేడారంలో భక్తుల రద్దీ నెలకొంది. సమ్మక్క– సారలమ్మలను దర్శించుకునేందుకు శుక్రవారం భక్తులు వేలాదిగా తరలివచ్చారు. జంపన్నవాగులో పుణ్యస్నానాలు ఆచరించి గద్దెల వద్దకు చేరుకుని పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు. భక్తులు భారీగా తరలిరావడంతో గద్దెల ప్రాంగణం కిటకిటలాడింది. మొక్కులు సమర్పించేందుకు భక్తులు సుమారుగా అరగంటపాటు క్యూలో నిలబడ్డారు.
ఒకే వరుసలో అమ్మవార్ల దర్శనం
అమ్మవార్ల గద్దెల ప్రాంగణంలో అభివృద్ధి పనులు సాగుతుండగా మేడారానికి భక్తులు తాకిడి భారీగా పెరిగింది. దీంతో పోలీసులు ఒకే వరుసలో క్రమ పద్ధతిలో భక్తులు అమ్మవార్లను దర్శించుకునేలా ఏర్పాటు చేశారు. జంపన్నవాగులో స్నానాలు చేసిన భక్తులు నేరుగా గద్దెల వద్దకు వచ్చిన భక్తులను పోలీస్ కమాండ్ కంట్రోల్ ద్వారా అమ్మవార్లను దర్శించుకునేలా బారికేడ్లను ఏర్పాటు చేశారు. ఒకే దారిలో వెళ్లిన భక్తులు సమ్మక్క గద్దెను దర్శించుకుని అదే వరుసలో ఉన్న సారలమ్మ, గోవిందరాజు, పగిడిద్దరాజు గద్దెల వద్ద మొక్కులు చెల్లించి దర్శించుకున్నారు. పక్కదారి నుంచి రాకుండా వన్‌వే ఏర్పాటు చేయడంతో భక్తులు అమ్మవార్లను ప్రశాంతంగా దర్శించుకున్నారు. ఎస్పీ సుధీర్ రాంనాథ్ కేకన్ భక్తుల రద్దీని పర్యవేక్షించి పోలీసు అధికారులకు భక్తులు ఇబ్బంది కలగకుండా చూడాలని పలు సూచలను చేశారు.
వందల సంఖ్యలో వాహనాలు
క్రిస్మస్ పండుగ నేపథ్యంలో ప్రభుత్వ కార్యాలయాలకు, విద్యాసంస్థలకు సెలవులు రావడంతో రాష్ట్రంలోని నలుమూలల నుంచి భక్తులు భారీగా వాహనాల్లో మేడారం వైపు కదిలివచ్చాయి. వందల సంఖ్యలో వచ్చిన వాహనాలను పోలీసులు పార్కింగ్ ప్రదేశాలకు మళ్లించేందుకు శ్రమించారు. మేడారం చుట్టూ ఉన్న అన్ని దారుల్లో పోలీసులు బందోబస్తూ ఏర్పాటు చేశారు.
మేడారంలో భక్తుల రద్దీ
వనదేవతల దర్శనానికి వన్‌వే ఏర్పాటు
పర్యవేక్షించిన ఎస్పీ
సుధీర్ రాంనాథ్ కేకన్
అమ్మవార్లకు మొక్కులు
అమ్మవార్లకు మొక్కులు


