నత్తనడకన నిర్మాణ పనులు
హన్మకొండ: టీజీ ఎన్పీడీసీఎల్ వరంగల్ సర్కిల్ కార్యాలయం నూతన భవన నిర్మాణ పనులు నత్తనడకన సాగుతోన్నాయి. రాష్ట్రంలో జిల్లాల పునర్విభజన నేపథ్యంలో ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఆరు జిల్లాలు పురుడుపోసుకున్నాయి. పూర్వ వరంగల్ జిల్లా కేంద్రంగా హనుమకొండ, వరంగల్ జిల్లాలు ఏర్పడ్డాయి. ఈ మేరకు టీజీ ఎన్పీడీసీఎల్‌లో నూతన జిల్లాల వారీగా సర్కిళ్లను ఏర్పాటు చేసింది. పూర్వ వరంగల్ సర్కిల్ కార్యాలయంలోనే హనుమకొండ సర్కిల్ కార్యాలయం కొనసాగుతోంది. రెండేళ్ల క్రితం వరకు హనుమకొండ నక్కలగుట్టలోని హనుమకొండ సర్కిల్ కార్యాలయం ఆవరణలోనే కొనసాగిన వరంగల్ సర్కిల్ కార్యాలయాన్ని ములుగు రోడ్డులోని విద్యుత్ ఉద్యోగుల శిక్షణ కేంద్రానికి తరలించారు. యాజమాన్యం వరంగల్ సర్కిల్ కార్యాలయ భవన నిర్మాణానికి నిధులు మంజూరు చేయడంతో రూ.1,33,88,971 వ్యయంతో ములుగు రోడ్డులో భవన నిర్మాణాన్ని చేపట్టారు. సంవత్సరన్నర కాలంగా ఈ నిర్మాణం సాగుతోంది. ఎన్పీడీసీఎల్ సీఎండీ వరుణ్ రెడ్డి పనులను పరిశీలించి జనవరి 26 లోపు పూర్తి చేసి నూతన భవనంలోకి కార్యాలయాన్ని తరలించాలని ఆదేశించారు. అయినా పనుల్లో వేగం పెంచలేదు. ప్రస్తుతం జరుగుతున్న పనులతీరును పరిశీలిస్తే మరో రెండు నెలలైనా పూర్తయ్యే అవకాశం కనిపించడం లేదని అధికారులే చెప్పడం గమనార్హం. ఈ పనులు పర్యవేక్షిస్తున్న సివిల్ ఇంజనీర్లు కూడా భవన నిర్మాణ పనులన్నీ పూర్తి కావడానికి మరో రెండు నెలల సమయం పడుతుందని చెప్పడం కొసమెరుపు. దీనికితోడు నిర్మాణ పనుల్లో నాణ్యత కొరవడిందనే ఆరోపణలున్నాయి. మెటీరియల్ వినియోగంలో నాణ్యతకు తిలోదకాలు ఇచ్చారు. సిమెంట్ నిర్ణీత మోతాదుకంటే తక్కువ వాడుతున్నారు.
కొనసాగుతున్న టీజీ ఎన్పీడీసీఎల్
వరంగల్ సర్కిల్ భవనం పనులు
జనవరి 26 లోపు పూర్తి చేయాలని సీఎండీ వరుణ్‌రెడ్డి ఆదేశాలు


