బంగారు వర్ణం గ్రిల్స్ ఏర్పాటు
● స్టెయిన్‌లెస్ స్టీల్‌తో నిర్మాణం
ఏటూరునాగారం: మేడారం సమ్మక్క– సారలమ్మ గద్దెల చుట్టూ గతంలో తెలుపు రంగులో ఉండే గ్రిల్స్‌ను బంగారు వర్ణంతో ఉన్న స్టెయిన్‌లెస్ గ్రిల్స్ ఏర్పాటు చేస్తున్నారు. ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సా రించి మంత్రి సీతక్క ఆధ్వర్యంలో నూతన హంగులతో గద్దెలను దివ్యాంగసుందరంగా తీర్చిదిద్దుతున్నారు. ఇందులో భాగంగానే నూతనంగా నిర్మించిన సమ్మక్క, సారలమ్మ, పగిడిద్దరాజు, గోవిందరాజుల గద్దెల చుట్టూ ఇప్పటికే గ్రానెట్ రాయితో గ ద్దెలను నిర్మించారు. దాని చుట్టూ భక్తుల తాకిడి గద్దెలకు తగలకుండా ఉండేందుకు నూతనంగా స్టెయిన్‌లెస్ స్టీల్ బంగారు వర్ణంలో ఉన్న పైపులతో నిర్మాణాలను చేపడుతున్నారు. దీనివల్ల ఎన్ని సంవత్సరాలైనా ఈ పైపులు తుప్పుపట్టకుండా మన్నికగా ఉంటాయి. తిరుమల తిరుపతి దేవస్థానంలో ఉండే ఇలాంటి బంగారు రంగు స్టెయిన్‌లెస్ స్టీల్‌ను మేడారం గద్దెల చుట్టూ వాడుతుండడం గమనార్హం.
అర్హులకు అందని సాయం
● ఆశగా ఎదురుచూస్తున్న తుపాను బాధితులు
ఖిలా వరంగల్: మొంథా తుపాను ప్రభావంతో సర్వసం కోల్పోయిన వరద బాధితులకు ప్రభుత్వం మొండిచేయిచ్చింది. ప్రభుత్వం ప్రకటించిన రూ.15 వేల సాయం నిజమైన లబ్ధిదారులకు అందలేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. రెండునెలలుగా ఎదురుచూసిన బాధితులకు సాయం దక్కలేదు. భారీ వరదలకు 34, 35 డివిజన్ల మధ్య రోడ్లకు ఇరువైపులా ఉన్న సుమారు 200 ఇళ్లు దెబ్బతిన్నాయి. వరద ముంచెత్తడంతో సర్వసం కోల్పోన ప్రజలు నాడు పునరావాస కేంద్రాల్లో తలదాచుకున్నారు. కానీ, 100 ఇళ్లకు మాత్రమే రూ.15 వేలు సాయం అందించడం బాధాకరమని, ఎలాంటి వరద తీవ్రత లేని కొందరికి సాయం ఇచ్చారని బాధితులు ఆరోపిస్తున్నారు. అధికారులు రీ సర్వేచేసి అసలైన లబ్ధిదారులను గుర్తించి సాయం అందజేయాలని వరద బాధితులు కోరుతున్నారు.


