గెలుపోటములపై చర్చ!
సాక్షి, మహబూబాబాద్: తెలంగాణ ఉద్యమకాలం నుంచి జిల్లాలో తనదైన ముద్ర వేసుకున్న బీఆర్‌ఎస్ పార్టీ ఇటీవల జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో చతికిల పడింది. అన్ని గ్రామాల్లో పార్టీకి బలమైన పట్టు ఉన్నా.. బరిలో నిలిచేందుకు పలుచోట్ల సరైన అభ్యర్థులు దొరకని పరిస్థితి. కార్యకర్తలు ఉన్నా.. వారికి వెన్నంటి ఉండే సరైన నాయకులు లేకపోవడంతోనే ఆశించిన ఫలితాలు రాలేదని పార్టీలో చర్చ జరుగుతోంది. నాయకుల మధ్య సమన్వయం కుదరకపోవడమే ప్రధాన కారణమని విమర్శలు వస్తున్నాయి. ఇలాంటి పరిస్థితిలో ఈనెల 27న బీఆర్‌ఎస్ పార్టీ రాష్ట్ర వర్కింట్ ప్రెసిడెంట్ కేటీఆర్ జిల్లాకు రానున్న నేపథ్యంలో.. పంచాయతీ ఎన్నికల్లో గెలుపోటములపై జరుగుతున్న చర్చ ప్రత్యేకతను సంతరించుకుంది.
135 స్థానాలకే పరిమితం
తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు తర్వాత రెండు పర్యాయాలు అధికారంలో ఉన్న బీఆర్‌ఎస్ పార్టీ.. ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికల్లో ఆశించిన ఫలితాలు సాధించలేకపోయింది. జిల్లాలో మొత్తం 482 జీపీలకు మూడు విడతలుగా ఎన్నికలు జరిగాయి. ఇందులో అధికార కాంగ్రెస్ పార్టీ మద్దతుతో 317మంది సర్పంచ్‌లుగా గెలిచారు. బీఆర్‌ఎస్ మద్దతుతో 135మంది సర్పంచ్‌లే గెలిచారు. ఇందులో డోర్నకల్ నియోజకవర్గంలో మాజీ మంత్రి రెడ్యానాయక్, మాజీ ఎంపీ మాలోత్ కవితలు ప్రచారం చేశారు. ప్రతీ గ్రామంలో నువ్వా.. నేనా.. అన్నట్లు అభ్యర్థులు పోటీ పడ్డారు. అయినా 53 స్థానాలు మాత్రమే గెలిచారు. మహబూబాబాద్ నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే బానోత్ శంకర్ నాయక్ ప్రచారం చేసినా.. కొన్ని స్థానాలపైనే దృష్టి పెట్టారని నియోజకవర్గ నాయకులు చెబుతున్నారు. ఇక మాజీ ఎంపీ కవిత కొన్ని ప్రాంతాలకే పరిమితమై ప్రచారం చేసినట్లు సమాచారం. మిగిలిన నాయకులు పెద్దగా పట్టించుకోలేదు. దీంతో అభ్యర్థులు ఒంటరి పోరాటం చేసినా.. 53 పంచాయతీలు మా త్రమే గెలిచారు. ఇక ఇల్లెందు నియోజకవర్గంలోని గార్లలో బీఆ ర్‌ఎస్ ఒక్క స్థానంలో కూడా గెలవలేదు. బయ్యారం మండలంలో మాత్రం ఎనిమిది పంచాయతీలు గెలిచారు. అయితే ఈ నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే హరిప్రియ పెద్దగా పట్టించుకోలేదని, కనీసం పోటీలో నిలబడిన పలువురు అభ్యర్థుల తరఫున ప్రచారం చేసేందుకు రాలేదని విమర్శలు ఉన్నాయి. మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు ప్రాతినిధ్యం వహించిన పాలకుర్తి నియోజకవర్గంలోని తొర్రూరు మండలంలో తొమ్మిది, పెద్దవంగర మండలంలో ఎనిమిది పంచాయతీలు గెలుచుకున్నారు. ఇక ములుగు నియోజకవర్గంలోని కొత్తగూడ మండలంలో దుర్గారం, గంగారం మండలంలో మూడు పంచాయతీలు మొత్తంగా నాలుగు జీపీలను బీఆర్‌ఎస్ మద్దతుదారులు గెలుచుకున్నారు. ఇక్కడ మంత్రి సీతక్కకు దీటుగా బీఆర్‌ఎస్ నాయకులు ప్రచారం చేయలేకపోయారు.
కేటీఆర్ రాకతో..
పంచాయతీ ఎన్నికల్లో గెలిచిన వారిని అభినందించేందుకు ఈనెల 27న బీఆర్‌ఎస్ పార్టీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ రాక ప్రత్యేకతను సంతరించుకోనుంది. గెలిచిన పంచాయతీలే కాకుండా ఓటమికి గల కారణాలు తెలుసుకునే పనిలో కేటీఆర్ ఉన్నట్లు కార్యకర్తలు చెబుతున్నారు. అయితే జిల్లాలో పార్టీ బలంగా ఉంది. కార్యకర్తలు ఉన్నారు.. కానీ మొదటి శ్రేణి నాయకుల మధ్య సమన్వయం లేదనే విమర్శలు ఉన్నాయి. దీనిని సరిదిద్దకపోతే వచ్చే ఎంపీటీసీ, జెడ్పీటీసీ, మున్సిపాలిటీ ఎన్నికల్లో కూడా పార్టీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని చెబుతున్నారు.
బీఆర్‌ఎస్ పార్టీలో మేధోమథనం
అన్ని గ్రామాల్లో బలమున్నా..
సర్పంచ్ అభ్యర్థులు దొరకని పరిస్థితి
నాయకుల సమన్వయ లోపంతో తప్పని ఇబ్బందులు
గెలిచిన వారికి అభినందనలు.. ఓటమిపై సమాలోచనలు
రేపు జిల్లాకు కేటీఆర్ రాక


