పంట ఉత్పత్తులకు రక్షణ
మహబూబాబాద్ రూరల్: ఆరుగాలం కష్టపడి పండించిన పంట మార్కెట్‌లో విక్రయించే సమయంలో వర్షం కురిసి తడిస్తే రైతు బాధ మాటల్లో చెప్ప లేం. కాగా సరిపడా కవర్ షెడ్లు లేకపోవడంతో ఆరుబటయ సరుకులను నిల్వ చేస్తున్నారు. దీంతో వర్షం వచ్చి తడిస్తే వ్యాపారులు అడిగిన ధరకు అమ్మాల్సిన దుస్థితి మానుకోట వ్యవసాయ మార్కెట్‌లో నెలకొంది. ఈమేరకు మార్కెట్ యార్డులో నూతన కవర్ షెడ్డు నిర్మాణానికి అనుమతులు వచ్చాయి. దీంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
ఇప్పటికే ఒక షెడ్డు..
వ్యవసాయ మార్కెట్ యార్డు ఆవరణలో ఇప్పటికే ఒక కవర్ షెడ్డు ఉండగా అందులో సీజన్ ఆధారంగా రైతులు మొక్కజొన్నలు, వరి పంట ఉత్పత్తులను విక్రయించేందుకు తీసుకువచ్చి రాశులుగా పోసుకుంటున్నారు. అయితే మిర్చి, పత్తి బస్తాలను మాత్రం కవర్ షెడ్డులో పెట్టేందుకు స్థలం లేకపోవడంతో యార్డు ఆవరణలోని ఆర్‌ఓబీ కింది భాగంలో ఏర్పాటు చేసిన షెడ్లు, ఇతర రేకుల షెడ్ల ప్రాంతాల్లో క్రయవిక్రయాల సమయాల్లో నిల్వ చేసుకుంటుంటారు. అకాల వర్షం, గాలివాన, ఇతర సమస్యలు తలెత్తినప్పుడు రైతుల అవసరాల మేరకు ఉన్న షెడ్లు సరిపోకపోవడంతో దశాబ్దాల తరబడి నుంచి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
మూడు రేకుల షెడ్లు ధ్వంసం..
ప్రస్తుతం మార్కెట్ యార్డు ఆవరణలో ఉన్న పాత మూడు రేకుల షెడ్ల పూర్తిగా ధ్వంసమై అడుగు భాగంలో ఉన్న సీసీ కూడా గుంతలు పడి వర్షం పడిన ప్రతీసారి రైతులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. ఈ క్రమంలో వ్యవసాయ మార్కెట్ కమిటీ పాలక మండళ్లు పలుమార్లు చేసిన విజ్ఞప్తులను గుర్తించి స్పందించిన ప్రభుత్వం మూడు మెట్రిక్ టన్నుల నిల్వ సామర్థ్యం కలిగిన నూతన కవర్ షెడ్డును మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. రూ.1.97 కోట్ల వ్యయంతో 81 మీటర్ల పొడవు, 18 మీటర్ల వెడల్పుతో పాత ఇనుప రేకుల షెడ్లను తొలగించి నూతన కవర్ షెడ్డు నిర్మాణం చేపట్టనున్నారు. దీంతో రైతుల కష్టాలకు చెల్లుచీటీ పడగా నూతన కవర్ షెడ్డు నిర్మాణం త్వరితగతన పూర్తి జరిగితే రైతులు తమ వ్యవసాయ ఉత్పత్తులను అందులో నిల్వ చేసుకునేందుకు వీలుంటుంది. ప్రభుత్వం, సంబంధిత అధికారులు త్వరలోనే నూతన కవర్‌షెడ్డు నిర్మాణ పనులు చేపట్టాలని రైతులు కోరుతున్నారు.
నూతన కవర్ షెడ్డు మంజూరు
అకాల వర్షం, సరుకుల నిల్వ సమస్యలకు చెక్
మానుకోట వ్యవసాయ మార్కెట్‌లో నిర్మాణం
పంట ఉత్పత్తులకు రక్షణ


