బైక్‌ను ఢీకొన్న డీజిల్ ట్యాంకర్
● పాల వ్యాపారి మృతి
● అన్నాసాగరం క్రాస్ వద్ద ఘటన
హసన్‌పర్తి : బైక్‌ను డీజిల్ ట్యాంకర్ ఢీకొన్న ఘటనలో ఓ పాల వ్యాపారి మృతి చెందాడు. ఈ ఘటన అన్నాసాగరం క్రాస్ వద్ద జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. ఎల్కతుర్తి మండలం చింతలపల్లికి చెందిన చందుపట్ల అశోక్‌కు ఇద్దరు కూతుళ్లు, కుమారుడు చందుపట్ల విద్యాసాగర్(23) ఉన్నారు. అశోక్ ప్రస్తుతం ఎల్కతుర్తిలోనే ఇల్లు నిర్మించుకుని జీవిస్తున్నాడు. విద్యాసాగర్ పాల వ్యాపారం చేస్తూ తల్లిదండ్రులకు చేదోడువాదోడుగా ఉంటున్నాడు. ఈ క్రమంలో గురువారం ఉదయం బైక్‌పై పాలు తీసుకుని భీమారం వైపునకు బయలుదేరాడు. మార్గమధ్యలోని అన్నాసాగరం క్రాస్ వద్ద వెనుక నుంచి వచ్చిన డీజిల్ ట్యాంకర్.. బైక్‌ను ఢీకొంది. ఈ ఘటనలో విద్యాసాగర్ అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. మృతుడి తండ్రి అశోక్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీస్ ఇన్‌స్పెక్టర్ చేరాలు తెలిపారు.


