మేడారం.. జనహారం
ఎస్‌ఎస్‌తాడ్వాయి: మహాజాతరకు ముందుగానే భక్తులు మేడారానికి భారీగా తరలొచ్చారు. గురువారం సమ్మక్క, సారలమ్మకు మొక్కులు చెల్లించుకునేందుకు రెండు తెలుగు రాష్ట్రాలతోపాటు ఛత్తీస్‌గఢ్, మహారాష్ట్రాల నుంచి వివిధ వాహనాల్లో వేలాదిగా తరలొచ్చారు. తొలుత జంపన్నవాగు స్నాన ఘట్టాల వద్ద ఏర్పాటు చేసిన షవర్ల కింద స్నానాలు ఆచరించి కల్యాణ కట్టలో పుట్టువెంట్రుకలు సమర్పించుకున్నారు. అనంతరం తల్లుల గద్దెల వద్ద పసుపు, కుంకుమలు, పూలు, పండ్లు, ఎత్తు బంగారం, కానుకలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు.
సందడిగా మేడారం..
భక్తుల రద్దీతో మేడారం సందడిగా మారింది. ఉద యం నుంచి మొదలైన భక్తుల రద్దీ సాయంత్రం 4 గంటల వరకు కొనసాగింది. ఊహించని విధంగా భక్తుల వేల సంఖ్యలో తరలిరావడంతో సమ్మక్క, సారలమ్మ గద్దెలు కిక్కిరిసిపోయాయి. గద్దెల పునర్నిర్మాణం పనులు జరుగుతున్న తరుణంలో భక్తులు క్రమపద్ధతిలో రావడానికి పోలీసులు చర్యలు తీసుకున్నారు. సమ్మక్క, సారలమ్మ గద్దెల నుంచి వరుస క్రమంలో నిలిపిన గోవిందరాజు, పగిడిద్దరాజు గద్దెలను భక్తులు దర్శించుకునేలా పకడ్బందీ చర్యలు చేపట్టారు.
వనంలో
వంటావార్పు..
మేడారంలోని వనాలన్నీ భక్తుల విడిదితో సందడిగా మారాయి. అమ్మవార్ల దర్శనం అనంతరం శివరాంసాగర్, ఆర్టీసీ బస్టాండ్, చిలకలగుట్ట, జంపన్నవాగు ప్రాంతాలోని చెట్ల కింద వంటావార్పు చేసుకుని సహంపక్తి భోజనాలు చేశారు. కాగా, తాగునీటి కోసం ఇబ్బందులు పడ్డారు. ఒక్కో మినరల్ వాటర్ క్యాన్‌కు రూ. 50 చెల్లించి వంటావార్పు చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. మేడారంలో అభివృద్ధి పనులు భక్తులు కొనియాడేలా జరుగుతున్నా తాగునీటి కోసం మాత్రం తంటాలు పడ్డారు.
అమ్మవార్లకు ముందస్తు మొక్కులు
వేలాదిగా తరలొచ్చిన భక్తులు
వనంలో వంటావార్పుతో సందడి
తాగునీటికి ఇక్కట్లు..
మేడారం.. జనహారం


