జాతీయ సదస్సులో టీచర్ అశోక్ పరిశోధన పత్రం సమర్పణ
విద్యారణ్యపురి : న్యూఢిల్లీలోని జాతీయ విద్యాపరిశోధన శిక్షణ ఆధ్వర్యంలో రాజస్థాన్‌లోని అజ్మీర్‌లో ఈనెల 22 నుంచి 24వ తేదీ వరకు నిర్వ హించిన జాతీయ సదస్సులో హనుమకొండకు చెందిన ప్రభుత్వ ఉపాధ్యాయుడు పోగు అశోక్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా పరిశోధన పత్రం సమర్పించారు. ప్రస్తుతం అశోక్ వరంగల్ కరీమాబాద్ ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయుడిగా విధులు నిర్వర్తిస్తున్నారు. దేశంలోని వివిధ రాష్ట్రాల నుంచి ఆచార్యులు, అధ్యాపకులు, ఉపాధ్యాయులు పాల్గొన్న ఈ జాతీయ సదస్సులో అశోక్ ‘ఎన్‌హాన్సింగ్ ట్వంటీ ఫస్ట్ సెంచరీ స్కిల్స్ ఇన్ సెకండరీ స్కూల్ స్టూడెంట్స్’ అనే అంశంపై పరిశోధనాపత్రాన్ని సమర్పించారు. తెలంగాణ నుంచి పోగు అశోక్ పరిశోధన పత్రం ఎంపిక కావడంతో ఆయన సమర్పించారు. ఈ జాతీయ సదస్సులో ఎస్‌సీఈఆర్‌టీ డైరెక్టర్ దినేష్‌ప్రసాద్, జాయింట్ డైరెక్టర్ ప్రకాశ్‌చంద్ర అగర్వాల్, అజ్మీర్ ప్రిన్సిపాల్ సుచితప్రకాశ్ చేతులమీదుగా అశోక్ ప్రశంస పత్రం అందుకున్నారు.
సైబర్ మోసం..
● రైతు ఖాతా నుంచి
రూ.1.50 లక్షలు మాయం
● కోమటిగూడెంలో ఘటన
స్టేషన్‌ఘన్‌పూర్: మండలంలోని కోమటిగూడెం గ్రామానికి చెందిన రైతు పర్శ సంతోష్ బ్యాంకు ఖాతాల నుంచి సైబర్ నేరగాళ్లు రూ.1.50 లక్షలు కాజేశారు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బాధితుడి కథనం ప్రకారం.. సైబర్ నేరగాళ్లు ఈ నెల 18న సంతోష్ యూనియన్ బ్యాంకు ఖాతా నుంచి రూ.99,980 మాయం చేశారు. దీంతో బాధితుడు అదేరోజు పోలీసులను ఆశ్రయించాడు. అనంతరం గురువారం మరోసారి ఎస్‌బీఐ ఖాతా నుంచి రూ.50,900 కాజేశారు. దీంతో ఏమి చేయాలో తెలియక ఆందోళనకు గురై మరోసారి పోలీసులకు ఫిర్యాదు చేశారు. తాను ఎలాంటి ఆన్‌లైన్ లింక్‌లు ఓపెన్ చేయలేదని, ఖాతాలోని డబ్బులు ఎలా పోయాయో అర్థం కావడం లేదని బాధితుడు వాపోతున్నాడు. ఈ విషయమై పోలీసులు స్పందించి తనకు న్యాయం చేయాలని, పోగొట్టుకున్న డబ్బులు వచ్చేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నాడు.
జాతీయ సదస్సులో టీచర్ అశోక్ పరిశోధన పత్రం సమర్పణ


