నిందితులను కఠినంగా శిక్షించాలి
గార్ల : మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో ఈనెల 11వ తేదీన మామను హత్య చేసిన నిందితులను కఠినంగా శిక్షించాలని మానవ హ క్కుల వేదిక రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్. తిరుపతయ్య డిమాండ్ చేశారు. ఈ మేరకు గురువారం మండలంలోని భోజ్యాతండాలో రాష్ట్ర మానవ హక్కుల వేదిక నిజనిర్ధారణ బృందం మృతుడు లాలూనాయక్ కుటుంబ సభ్యులను కలిసి హత్యకు సంబంధించిన వివరాలు సేకరించారు. మృతుడి కుటుంబీకుల కథనం ప్రకారం.. గార్ల మండలం భోజ్యాతండాకు చెందిన లాలూనాయక్ కూతురు లహరిని పెద్దతండాకు చెందిన గుగులోత్ సీతారాం కుమారుడు గాంధీబాబుకు ఇచ్చి 2022 ఫిబ్రవరి 11న వివాహం చేశారు. వరకట్నం కింద సుమారు రూ. కోటి అందజేశారు. లహరికి ఇద్దరు పిల్లలు సంతానం. అయినా అదనపు కట్నం కావాలని భర్త, అత్త, మామ.. తరచూ వేధింపులకు గురిచేస్తున్నారు. ఈనెల 11న కూడా వేధింపులకు గురిచేయడంతో లహరి తన తండ్రికి ఫోన్ ద్వారా విషయం చెప్పింది. వెంటనే తండ్రి లాలూనాయక్, తమ్ముడు కలిసి అల్లుడి ఇంటికి వచ్చారు. తన కూతురును ఎందుకు కొడుతున్నారని ప్రశ్నించినందుకు అల్లుడు, మామ, అత్త కలిసి లాలూనాయక్‌పై దాడి చేయడంతో స్పృహ తప్పాడు. వెంటనే కుమారుడు.. లాలూనాయక్‌ను ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతిచెందాడని వైద్యులు తెలిపారు. తన తండ్రి లాలూనాయక్ మృతికి కారణమైన అల్లుడు, అతడి తండ్రి, తల్లిని కఠినంగా శిక్షించి త మకు న్యాయం చేయాలని లహరి మానవ హక్కుల వేదిక బృందాన్ని వేడుకుంది. విచారణ చేపట్టిన బృందంలో మానవ హక్కుల వేదిక రాష్ట్ర ఉపాధ్యక్షుడు బి. రాజు, కార్యదర్శి టి. హరికృష్ణ, వరంగల్ జిల్లా అధ్యక్షుడు ఎ. యాదగిరి, ప్రధాన కార్యదర్శి దిలీప్, తదితరులు ఉన్నారు.
మానవ హక్కుల వేదిక రాష్ట్ర ప్రధాన కార్యదర్శి
తిరుపతయ్య
భోజ్యాతండాలో విచారణ


