మానవాళి రక్షణకు క్రీస్తు జననం
కాజీపేట రూరల్ : ప్రపంచ మానవాళి రక్షణ కోసం ఏసుక్రీస్తు జన్మించారని ఓరుగల్లు కథోలిక పీఠం పాలనాధికారి రెవరెండ్ ఫాదర్ డి. విజయపాల్‌రెడ్డి అన్నారు. కాజీపేట ఫాతిమా కెథిడ్రల్ చర్చి ప్రాంగణంలో బుధవారం అర్ధరాత్రి నుంచి గురువారం తెల్లవారుజాము వరకు క్రిస్మస్ జాగరణ, దివ్య బలి పూజ జరిగింది. ఈ కార్యక్రమంలో ఫాదర్ విజయపాల్‌రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ క్రీస్తు జననం చారిత్రాత్మక సత్యమని, అద్భుత ఘట్టమని, ప్రపంచంలోని 195 దేశాల్లో క్రీస్తు జననాన్ని పండుగగా జరుపుకుంటున్నారన్నారు. నీతి, న్యాయం, ధర్మం, ప్రేమతో జీవించాలని క్రీస్తు బోధించారని తెలిపారు. అనంతరం అందరి సమక్షంలో ఫాదర్ విజయపాల్‌రెడ్డి కేక్ కట్ చేసి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపి ప్రత్యేక ప్రార్థనలు చేశారు. సంగీత దర్శకుడు నల్ల ప్రణిల్ ఆధ్వర్యంలో ప్రత్యేక క్రీస్తు గీతాలు ఆలపించారు. కార్యక్రమంలో చర్చి విచారణ గురువు కాసు మర్రెడ్డి, సహాయ విచారణ గురువు ఫాదర్ విద్యాసాగర్, బ్రదర్స్, సిస్టర్స్, కౌన్సిల్ సభ్యులు పాల్గొన్నారు.
ఘనంగా క్రిస్మస్ వేడుకలు..
ఫాతిమా కెథిడ్రల్ చర్చిలో గురువారం క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరిగాయి. చర్చి విచారణ గురువు ఫాదర్ కాసు మర్రెడ్డి మహోత్సవ, దివ్య బలి పూజ నిర్వహించి క్రిస్మస్ సందేశం చేసి క్రీస్తు జననం గురించి వివరించారు. అనంతరం క్రిస్మస్ కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు.
ఓరుగల్లు పీఠం పాలనాధికారి ఫాదర్ విజయపాల్‌రెడ్డి


