రూ.16 లక్షల విలువైన పీడీఎస్ సన్నబియ్యం పట్టివేత
పాలకుర్తి టౌన్: అక్రమంగా తరలిస్తున్న రూ.16 లక్షల విలువైన రేషన్ (పీడీఎస్) స న్న బియ్యాన్ని పట్టుకున్నట్లు ఎస్సై పవన్‌కుమార్ తెలిపారు. ఎస్సై కథనం ప్రకారం.. హైదరాబాద్‌కు చెందిన ఐతే కృష్ణ, శ్రీకాంత్.. రేషన్ బియ్యం అక్రమంగా సేకరించి ఇతర రాష్ట్రాల్లో విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. ఖమ్మం జిల్లా మధిర ప్రాంతంలో సేకరించిన బియ్యాన్ని రెండు లారీల్లో లోడ్ చేసి మహారాష్ట్రకు తరలిస్తున్నారు. ఈ క్రమంలో బుధవారం జనగామ జిల్లా పాలకుర్తి మండల కేంద్రంలోని వల్మిడి క్రాస్ రోడ్డు వద్ద పోలీసులు వాహనాలు తనిఖీ చేస్తున్న క్రమంలో రెండు లారీలను ఆపారు. సన్న బియ్యం ఎక్కడికి తరలిస్తున్నారని డ్రైవర్లను ప్రశ్నించగా పొంతనలేని సమాధానాలు చెప్పారు. దీంతో బియ్యాన్ని అక్రమంగా తరలిస్తున్నారని పోలీసులు నిర్ధారించుకున్నారు. అనంతరం పౌర సరఫరాల శాఖ డీటీ.. లారీల్లోని బియ్యాన్ని పరిశీలించి రేషన్‌గా తేల్చారు. దీంతో రెండు లారీల్లో రూ.16 లక్షల విలువైన 370 క్వింటాళ్ల బియ్యం స్వాధీనం చేసుకుని లారీలను సీజ్ చేయడంతో పాటు కృష్ణ, శ్రీకాంత్, జార్ఘండ్‌కు చెందిన డ్రైవర్లపై కేసు నమోదు చేసి రిమాండ్ తరలించినట్లు ఎస్సై తెలిపారు. కృష్ణ, శ్రీకాంత్ పరారీలో ఉన్నారని ఎస్సై పేర్కొన్నారు.
రూ.16 లక్షల విలువైన పీడీఎస్ సన్నబియ్యం పట్టివేత


