
ఉగ్రరూపం దాల్చిన గోదావరి
కాళేశ్వరం: ఎగువన కురుస్తున్న భారీ వర్షాలతో ఎస్సారెస్పీ, కడెం, ఎల్లంపల్లి ప్రాజెక్టుల ద్వారా వరద ప్రవాహం తరలిరావడంతో కాళేశ్వరం వద్ద గోదావరి గురువారం సాయంత్రం ఉగ్రరూపం దాల్చింది. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలంలో కాళేశ్వరం ప్రాజెక్టులోని అన్నారం బ్యారేజీ వద్ద 3.52 లక్షల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో తరలివస్తుంది. దీంతో బ్యారేజీలో మొత్తం 66 గేట్లు ఎత్తి నీటిని దిగువకు అదేస్థాయిలో ఔట్‌ఫ్లో రూపంలో కాళేశ్వరం వైపునకు తరలిస్తున్నారు. కాళేశ్వరం త్రివేణి సంగమం వద్ద మహారాష్ట్ర నుంచి తరలి వస్తున్న ప్రాణహితనదితో కలిసి గోదావరి వరద ప్రవాహం పుష్కర ఘాట్లను తాకుతూ 9.500 మీటర్ల ఎత్తులో నీటిమట్టం దిగువకు తరలిపోతుంది. దిగువన కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ బ్యారేజీలో 5.52లక్షల క్యూసెక్కులు ఇన్‌ఫ్లో మొత్తం 85 గేట్లు ఎత్తివేసి ఉంచడంతో అదేస్థాయిలో ఔట్‌ఫ్లో దిగువకు ఇంజనీర్లు తరలిస్తున్నారు. దీంతో గోదావరికి పెద్ద ఎత్తున వరద ఎగువ నుంచి తరలి రావడంతో అధికార యంత్రాంగం అప్రమత్తం అవుతున్నారు. శుక్రవారం ఉదయం వరకు భారీగా వరద తరలిరానున్నట్లు ఇరిగేషన్ అధికారులు పేర్కొంటున్నారు. దీంతో అన్నారం సమీపంలోని చండ్రుపల్లి వాగు గోదావరి కమ్మెయడంతో రాకపోకలు నిలిచిపోయాయి. అన్నారం టు మద్దుపల్లి వరకు రవాణాస్తంభించింది.