
తల్లితో తనువు చాలించాలనుకున్న కొడుకు..
● కోడిపుంజులతండాలో విషాదం
బయ్యారం: నవమాసాలు మోసిన తల్లితో తాను తనువు చాలించాలనుకొని గడ్డిమందు తాగిన కొడుకు చికిత్స పొందుతూ బుధవారం మృతి చెందాడు. వివరాలు ఇలా ఉన్నాయి. మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండలంలోని కోడిపుంజులతండాకు చెందిన ధరావత్ రాజు మహబూబాబాద్ మండలం సలార్‌తండాకు చెందిన కవితను రెండో వివాహం చేసుకున్నాడు. అప్పటికే కవితకు వివాహం జరిగి కుమారుడు సాద్విక్ అలియాస్ మున్న(11) జన్మించగా కుమారుడిని తీసుకొని రాజు వద్దకు వచ్చింది. వీరికి కుమార్తె భవ్యశ్రీ జన్మించగా ఈ నెల 21న రాత్రి సమయంలో రాజు, కవితల మధ్య వివాదం చోటుచేసుకోగా 22వ తేదీన ఉదయం కవిత మనస్తాపానికి గురై ఇంట్లో ఉన్న గడ్డిమందు తాగింది. ఇది చూసిన కుమారుడు మున్న అదే గడ్డిమందును తాగగా స్థానికులు ఇద్దరిని చికిత్స నిమిత్తం మహబూబాబాద్‌లోని ఓ ఆస్పత్రికి తరలించారు. అక్కడ పరిస్థితి విషమించి మున్న మృతి చెందగా తల్లి కవిత కోలుకుంటుంది. కాగా భార్యాభర్తల మధ్య జరిగిన వివాదంలో అభంశుభం తెలియని చిన్నారి మృతి చెందడంతో కోడిపుంజులతండాలో విషాదం నెలకొంది. మృతుడి అమ్మమ్మ ఫిర్యాదు మేరకు ఎస్సై తిరుపతి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

తల్లితో తనువు చాలించాలనుకున్న కొడుకు..