
వినాయక విగ్రహాల
రవాణాలో జాగ్రత్తలు తీసుకోవాలి..
హన్మకొండ: వినాయక విగ్రహాల తయారీ, రవాణాలో జాగ్రత్తలు తీసుకోవాలని టీజీ ఎన్పీడీసీఎల్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ కర్నాటి వరుణ్ రెడ్డి అన్నారు. విగ్రహాల తయారీదారులు, నవరా త్రి ఉత్సవ నిర్వాహకులు విద్యుత్‌పై అప్రమత్తంగా ఉండాలన్నారు. ఈ మేరకు బుధవారం హనుమకొండ నక్కలగుట్టలోని టీజీ ఎన్పీ డీసీఎల్ ప్రధాన కార్యాలయం నుంచి 16 సర్కిళ్లు సూపరింటెండెంట్ ఇంజనీర్లు, డీఈ, ఏడీఈలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎండీ మాట్లాడుతూ ఈ నెల 27న వినాయక చవితి సందర్భంగా గణేశ్ విగ్రహాల తరలింపు జరుగుతుందని, దీనిపై విద్యుత్ అధికారులు అప్రమత్తంగా ఉండాలన్నారు. విగ్రహాలు తరలించే రహదారుల్లో విద్యుత్ నెట్‌వర్క్ పరంగా ఎలాంటి లోపం లేకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. భక్తులు, నవరాత్రి ఉ త్సవ నిర్వాహకులు మండపాల వద్ద విద్యుత్ భద్రతా చర్యలు పాటించాలని కోరారు. అలాగే, ఆపరేటర్లతో సమావేశం నిర్వహించి స్తంభాలకు ఉన్న టీవీ కేబుల్, ఇంటర్నెట్ కేబుల్ తీగలు తొలగించాలని సూచించాలని ఆదేశించారు. ఆ కేబుళ్లు ప్రమాదకరంగా ఉండడంతో విద్యుత్ ప్రమాదాలు జరుగుతున్నాయన్నారు. విద్యుత్ లైన్ ఎక్కడైనా తెగి పడినా, ఇతర అత్యవసర పరిస్థితులు ఏర్పడినా వెంటనే 19 12కు గాని సమీపంలోని విద్యుత్ సిబ్బందికి సమాచారం అందించాలన్నారు. కార్యక్రమంలో డైరెక్టర్లు వి.మోహన్ రెడ్డి, టి.మధుసూదన్, సీజీఎం అశోక్, జీఎం సురేందర్ పాల్గొన్నారు.
మండపాల వద్ద తీసుకోవాల్సిన జాగ్రత్తలు..
● మండపాలకు విద్యుత్ సరఫరా కనెక్షన్ కోసం సామాన్యులు స్తంభాలు ఎక్కొద్దు. సంస్థ సిబ్బందితోనే విద్యుత్ కనెక్షన్ పొందాలి.
● ఐఎస్‌ఐ మార్క్ కలిగిన ప్రామాణిక విద్యుత్ తీగలను మాత్రమే వినియోగించాలి. ఎలాంటి జాయింట్ తీగలు వినియోగంచొద్దు. తగినంత కెపాసిటీ కలిగిన ఎంసీబీ తప్పనిసరిగా వాడాలి. ఇది విద్యుత్ ప్రమాదాల నుంచి రక్షణ ఇస్తుంది.
● మండపాల్లో విద్యుత్ సంబంధిత పనులు చేసేటప్పుడు పరిసరాలను క్షుణ్ణంగా పరిశీలించాలి. విద్యుత్ తీగలు, స్తంభాలు, ఇతర ప్రమాదకర విద్యుత్ పరికరాల నుంచి పిల్లలను దూరంగా ఉంచాలి.
● ఒక వేళ ఎవరికై నా విద్యుత్ షాక్ తగిలితే వారికి వెంటనే వైద్య సహాయం అందించి, ఆ ప్రమాద సమాచారాన్ని సమీపంలోని విద్యుత్ సిబ్బందికి తెలపాలి.
● విద్యుత్ వైరింగ్‌లో ఎక్కడైనా అతుకులు ఉంటే వర్షాలు కురిసిన సమయంలో తేమతో షాక్ కలిగే అవకాశముంది. అందుకే మండప నిర్వాహకులు ప్రతీ రోజు తప్పనిసరిగా వైరింగ్‌ను క్షుణ్ణంగా పరిశీలించాలి.
తయారీదారులు, ఉత్సవ నిర్వాహకులు అప్రమత్తంగా ఉండాలి
టీజీ ఎన్పీడీసీఎల్ చైర్మన్, మేనేజింగ్
డైరెక్టర్ కర్నాటి వరుణ్ రెడ్డి