
వ్యాపారి పరారీపై పోలీసుల ఆరా
● గ్రెయిన్ మార్కెట్‌లో విచారణ
జనగామ: ఆన్‌లైన్ రమ్మీకి బానిసై.. మరో వైపు వ్యాపారంలో నష్టం వచ్చి రూ. కోటి అప్పు చేసి ఉడాయించిన వ్యాపారి ఆచూకీపై పోలీసులు ఆరా తీస్తున్నారు. కొంత కాలంగా సూర్యాపేట రోడ్డులో చిల్లకాంటా ఏర్పాటు చేసుకుని వివిధ అపరాలు కొనుగోలు చేస్తూ నమ్మకంగా ఉన్న ఓ వ్యాపారి నాలుగు రోజుల క్రితం రాత్రికి రాత్రే పరారైన ఘటన విధితమే. ఈ మేరకు ఆ వ్యాపారి ఎక్కడికి వెళ్లారు..? ఆన్‌లైన్ రమ్మీ ఆటలో ప్రోత్సహించిందెవరు..? అనే కోణంలో పోలీసులు గ్రెయిన్ మార్కెట్‌లో దర్యాప్తు చేస్తున్నారు. అలాగే, అప్పులిచ్చిన వారి వద్దకు వెళ్లి వివరాలు సేకరిస్తున్నారు.
ఆన్‌లైన్ రమ్మీ గేమ్‌పై
ఆందోళన
ఆన్‌లైన్ రమ్మీ మహమ్మారి అనేక కుటుంబాలను రోడ్డున పడేస్తుందనే ప్రచారం తల్లిదండ్రుల్లో ఆందోళన కలిగిస్తోంది. సిద్దిపేట రోడ్డుని ప్రధాన కాలనీలతోపాటు శివారు ప్రాంతాల్లో కొంత మంది బూకీలు అడ్డావేసి ఆన్‌లైన్ రమ్మీ గేమింగ్‌ను ప్రోత్సహిస్తున్నట్లు తెలుస్తోంది. దీనిపై పోలీసు నిఘా పెద్దగా లేకపోవడంతో బూకీలు ఆడింది ఆట.. పాడింది పాటగా మారుతోందని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.