
అదుపు తప్పి కల్వర్టును ఢీకొన్న బొలెరో
పెళ్లి రోజే చివరి రోజు..
లింగాలఘణపురం: బొలెరో వాహనం అదుపు తప్పి కల్వర్టును ఢీకొంది. ఈ ప్రమాదంలో తల్లిదండ్రులు దుర్మరణం చెందగా ఇద్దరు పిల్లలు ప్రాణాలతో బయటపడ్డారు. ఈ ఘటన బుధవారం జనగామ – సూర్యాపేట జాతీయ రహదారి 365పై జనగామ జిల్లా లింగాలఘణపురం మండలం వడిచర్ల సమీపంలో చోటు చేసుకుంది. లింగాలఘణపురం ఎస్సై శ్రావణ్‌కుమార్ కథనం ప్రకారం.. ఆంధ్రప్రదేశ్‌లోని పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా మనుబోలు మండలం వడ్లపూడి గ్రామానికి చెందిన దద్దోలు సురేశ్ (35) తన భార్య దివ్య (32), కూతురు మోక్షజ్ఞ, కుమారుడు లోక్షణతో కలిసి స్వగ్రామం నుంచి బొలెరో వాహనంలో తాను పని చేసే కరీంనగర్‌కు బయలుదేరారు. ఈ క్రమంలో సురేశ్ నిద్రమత్తులో డ్రైవింగ్ చేయడంతో వాహనం అదుపు తప్పి వడిచర్ల సమీపంలో కల్వర్టును ఢీకొంది. ఈ ఘటనలో దంపతులు అక్కడికక్కడే దుర్మరణం చెందారు. కూతురు, కుమారులకు స్వల్ప గాయాలు కావడంతో 108లో పోలీసులు జనగామ ఏరియా ఆస్పత్రికి తరలించారు. మృతుడు కరీంనగర్‌లోని ఓ గ్రానైట్ కంపెనీలో పని చేస్తున్నట్లు సమాచారం. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్సై తెలిపారు. కాగా, రోడ్డు ప్రమాదంలో తల్లిదండ్రులు చనిపోయినా ఏం జరిగిందో తెలియని స్థితిలో ఉన్న ఆ చిన్నాలను చూసి స్థానికులు కన్నీరుమున్నీరుగా విలపించారు. తల్లిదండ్రులు చనిపోయిన విషయం చెప్పలేక ఆస్పత్రిలో ప్రాథమిక చికిత్స అందిస్తున్నారు.
తల్లిదండ్రుల దుర్మరణం
ప్రాణాలతో బయటపడిన చిన్నారులు
వడిచర్ల సమీపంలో ఘటన
మృతులు ఏపీలోని నెల్లూరు జిల్లావాసులు
మనుబోలు: తెలంగాణ రాష్ట్రం జనగామ జిల్లా లింగాల ఘనపురం మండలం వడ్డిచెర్ల వద్ద బుధవారం బొలెరో క ల్వర్టును ఢీకొన్న ప్రమాదంలో దుర్మరణం చెందిన నెల్లూరు జిల్లా వడ్లపూడి గ్రామానికి చెందిన దద్దొలు సురేశ్ (35), దివ్య (32) దంపతులకు పెళ్లి రోజే చివరి రోజు అయ్యింది. ఈ ఘటనతో వడ్లపూడిలో విషాదఛాయలు అలుముకున్నాయి. గ్రామానికి చెందిన దద్దొలు పెంచలయ్య, జయమ్మ దంపతుల చిన్న కుమారుడు సురేశ్ తెలంగాణలోని కరీంనగర్‌లోని ఓ గ్రానైట్ కంపెనీలో పనిచేస్తున్నాడు. వారం క్రితం బంధువుల పెళ్లి ఉండడంతో పిల్లలతో కలిసి దంపతులు వడ్లపూడికి వచ్చారు. బుధవారం తమ పెళ్లి రోజు కావడంతో వేకువజామునే కారులో బయలుదేరారు. ముందు రోజు రాత్రి సరిగా నిద్ర లేకపోవడంతోనే ఏమోకానీ నిద్రమత్తులో కారు కల్వర్టును ఢీకొనడంతో సురేశ్, దివ్య ఇద్దరు చనిపోగా పిల్లలు స్వల్ప గాయాలతో బయటపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.

అదుపు తప్పి కల్వర్టును ఢీకొన్న బొలెరో

అదుపు తప్పి కల్వర్టును ఢీకొన్న బొలెరో