
ఉప్పొంగిన గోదావరి..
కాళేశ్వరం: తెలంగాణ, మహారాష్ట్రల్లో కురుస్తున్న వర్షాలతో కాళేశ్వరం వద్ద గోదావరి ఉప్పొంగి ప్రవహిస్తోంది. బుధవారం ఎగువన కడెం ప్రాజెక్టు నుంచి వరదనీరు గోదావరి మీదుగా తరలిరాగా, మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లా నుంచి ప్రాణహిత నది వరదతో కలిసి కాళేశ్వరం వద్ద ఉగ్రరూపం దాల్చింది. దీంతో పుష్కర ఘాట్ వద్ద అధికారులు మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. ప్రస్తుతం 104.11 మీటర్ల ఎత్తులో నీటిమట్టం చేరింది. మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేయగా, చివరి హెచ్చరిక 104.75 మీటర్లు చేరితే జారీ చేస్తారు. ఈ వరద నీరు దిగువ మేడిగడ్డ వైపునకు తరలుతోంది. కాగా, కాళేశ్వరం వద్ద చివరి హెచ్చరిక చేరువకు వరద నీరు చేరడంతో గోదావరి వద్ద చిరు దుకాణాలను అధికారులు ఖాళీ చేయిస్తున్నారు.
ప్రాజెక్టుల్లో..
గోదావరి గుండా మహదేవపూర్ మండలం కాళేశ్వరం ప్రాజెక్టులోని అన్నారం బ్యారేజీ వద్ద 5.42లక్షల క్యూసెక్కుల వరద తరలి వస్తోంది. దీంతో బ్యారేజీలోని మొత్తం 66గేట్లు ఎత్తి నీటిని దిగువకు కాళేశ్వరం వైపునకు తరలిస్తున్నారు. అక్కడి నుంచి మేడిగడ్డ బ్యారేజీలోకి 10.43లక్షల క్యూసెక్కులు తరలివస్తోంది. దీంతో మొత్తం 85గేట్లు ఎత్తి నీటిని దిగువకు తరలిస్తున్నారు.
నీట మునిగిన పంటలు..
అన్నారం –మేడిగడ్డ బ్యారేజీ వరకు సుమారు 120 ఎకరాల్లో పత్తి, వరి పంటలు నీటముగినట్లు వ్యవసాయశాఖ అధికారులు ప్రాథమికంగా అంచనా వేశారు. దీంతో తీవ్రంగా నష్టపోయామని రైతులు ఆందోళన చెందుతున్నారు. ప్రభుత్వం ఆదుకోవాలని కోరుతున్నారు.
రాకపోకలు బంద్..
అన్నారం బ్యారేజీ గుండా వచ్చే వరదతో చండ్రుపల్లి వాగును బ్యాక్‌వాటర్ కమ్మేయడంతో రాకపోకలు నిలిచాయి. అన్నారం నుంచి చండ్రుపల్లి, నాగేపల్లి, మద్దులపల్లి వయా కాళేశ్వరం రహదారి స్తంభించింది. దీంతో ఆయా గ్రామాల ప్రజలు రాకపోకలకు ఇబ్బందులు పడుతున్నారు.
కాళేశ్వరం వద్ద 104.11 మీటర్ల ఎత్తులో నీటిమట్టం
మొదటి హెచ్చరిక జారీ,
చివరి హెచ్చరికకు చేరువ

ఉప్పొంగిన గోదావరి..