ధాన్యంలో కోత.. రైతుల ఆందోళన
కేసముద్రం: మిల్లర్లు దిగుమతి చేసిన ధాన్యంలో కోత విధిస్తున్నారంటూ పలువురు రైతులు ఆందోళనకు దిగిన సంఘటన మున్సిపాలిటీ పరిధిలోని ఓ రైస్ మిల్లులో గురువారం చోటుచేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి.. పెద్దవంగర మండలం గట్లగుంట గ్రామ శివారు రామోజీతండాకు చెందిన రైతులు జాటోత్ మంగీలాల్, లకావత్ సోమ్లా, జాటోత్ బాలాజీ, జాటోత్ నీలమ్మ, కుమార్, అనూష, నరేష్, లక్ష్మి, జాటోత్ కొమురమ్మ పోచంపల్లి ఐకేపీ సెంటర్‌లో తమ ధాన్యాన్ని ఇటీవల అమ్ముకున్నారు. ఈ నెల 24న రెండు లారీల్లో 932 బస్తాల చొప్పున కేసముద్రంలోని ఓం సాయి ఇండస్ట్రీస్‌కి తరలించగా.. బస్తాలను దిగుమతి చేసుకున్నారు. ఈ క్రమంలో ట్రక్ షీట్‌పై రాసిచ్చే క్రమంలో ధాన్యం తడిసిందని, ఇందుకుగాను బస్తాకు 2 కిలోల చొప్పున కోత విధిస్తామని నిర్వాహకులు చెప్పారు. తడిసిన ధాన్యం, తడవని ధాన్యానికి ఒకే విధంగా ఎలా కోత విధిస్తారంటూ ఆ రైతులు మిల్లు ఆవరణలో ఆందోళనకు దిగారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని, రైతులకు నచ్చజెప్పారు. అనంతరం ధాన్యంలో ఎలాంటి కోత విధించకుండా తీసుకుంటామని సదరు మిల్లరు చెప్పడంతో రైతులు శాంతించారు.


