90శాతం ధాన్యం సేకరణ
మహబూబాబాద్ అర్బన్: రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటి వరకు 90శాతం ధాన్యం సేకరించినట్లు సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. మంగళవారం హైదరాబాద్ నుంచి సీఎం రేవంత్‌రెడ్డి.. ఉపముఖ్యమంత్రి మల్లు బట్టి విక్రమార్క, మంత్రులతో కలిసి అన్ని జిల్లాల కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు, అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. గతంలో ఎన్నడూ లేనివిధంగా ధాన్యం కొనుగోలు చేశామన్నారు. ఇప్పటి వరకు 90శాతం ధాన్యం సేకరణ పూర్తయిందన్నారు. 15రోజుల ముందు రుతుపవనాలు రావడంతో మిగిలిన ధాన్యం సేకరణ ఇబ్బందిగా మారిందన్నారు. రైతులకు రూ.1,2184 కోట్లు చెల్లించామన్నారు. మిల్లర్లు, దళారులు రైతులను ఇబ్బంది పెడితే కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. వ్యవసాయశాఖ అధికారులు అప్రమత్తంగా ఉండాలని, రైతులకు ఎరువులు, విత్తనాలు అందుబాటులో ఉన్నాయన్నారు. నకిలీ విత్తనాలు అమ్మేవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని, అవసరమైతే అలాంటి వారిపై పీడీ యాక్ట్ పెట్టాలన్నారు. నకిలీ విత్తనాలపై రైతులకు అవగాహన కల్పించాలన్నారు. కలెక్టర్లు క్షేత్రస్థాయిలో పర్యటించి అభివృద్ధి పనులను పరిశీలించాలని ఆదేశించారు. భూభారతి చట్టం అవగాహన సదస్సులు నిర్వహించాలని, ఇందిరమ్మ ఇళ్లను వేగవంతం చేయాలన్నారు. జూన్ 2న రాష్ట్ర ఆవిర్భావ వేడుకలను అన్ని జిల్లాల్లో ఘనంగా నిర్వహించాలన్నారు. కలెక్టరేట్ నుంచి వీసీలో కలెక్టర్ అద్వైత్‌కుమార్‌సింగ్, అదనపు కలెక్టర్లు లెనిన్ వత్సల్ టొప్పో, వీరబ్రహ్మచారి, ఆర్డీఓలు కృష్ణవేణి, గణేష్, డీఆర్డీఓ మధుసూదన్‌రాజ్, అధికారులు వెంకటేశ్వర్లు, విజయనిర్మల, ప్రేమ్‌కుమార్, నర్సింహరావు, మరియన్న తదితరులు పాల్గొన్నారు.
వీసీలో సీఎం రేవంత్‌రెడ్డి


