రామప్పలో రెండున్నర గంటల పర్యటన
వెంకటాపురం(ఎం): యునెస్కో గుర్తింపు పొందిన ములుగు జిల్లా వెంకటాపురం(ఎం) మండలంలోని రామప్ప దేవాలయాన్ని ఈ నెల 14న 35 దేశాలకు చెందిన మిస్ వరల్డ్ కంటెస్టెంట్లు సందర్శించనున్నారు. ఈ నేపథ్యంలో వారి పర్యటన షెడ్యూల్‌ను అధికారులు ఖరారు చేశారు. 14న సాయంత్రం 5.15 గంటలకు ఆలయానికి మిస్ వరల్డ్ టీం బస్సులో చేరుకుంటుంది. 5.20 గంటలకు రామప్పలో ఏర్పాటు చేసిన స్టాల్ వద్ద పూజాసామగ్రి కొనుగోలు చేస్తారు. 5.25 గంటలకు ఆలయం వద్ద గిరిజన నృత్యంతో కళాకారులు స్వాగతం పలుకుతారు. 5.30 గంటలకు పూజారులు పూర్ణకుంభంతో వారికి స్వాగతం పలికి ఆలయంలోకి ఆహ్వానిస్తారు. 5.35 నుంచి 6:25 గంటల వరకు రామలింగేశ్వరస్వామివారిని దర్శించుకుని ఆలయ శిల్పకళ సంపదను తిలకిస్తారు. ఆలయ విశిష్టత గురించి వారికి టూరిజం గైడ్‌లు వివరిస్తారు. సాయంత్రం 6.30 గంటలకు రామప్ప గార్డెన్‌లో ఏర్పాటు చేసిన వేదిక వద్ద సాంస్కృతిక కార్యక్రమాలు ప్రారంభమవుతాయి. 6.33 గంటలకు అలేఖ్య పుంజాల బృందంతో క్లాసికల్ డ్యాన్స్, రాత్రి 7.08 గంటలకు పేరిణి నృత్య ప్రదర్శన, 7.25 గంటలకు మిస్‌వరల్డ్ టీం కంటెస్టెంట్లకు ప్రముఖులతో సత్కారం ఉంటుంది. 7.35 గంటలకు ముఖ్య అతిథి ప్రసంగం, 7.42 గంటలకు సాంస్కృతిక కార్యక్రమాలు ముగుస్తాయి. రామప్పలో రెండున్నర గంటల పాటు పర్యటించిన అనంతరం సుందరీమణులు డిన్నర్ చేసి హైదరాబాద్‌కు తిరుగు ప్రయాణం కానున్నారు. కాగా, మిస్‌వరల్డ్ కంటెస్టెంట్లు హిందూ సంప్రదాయ దుస్తుల్లో రామప్పను సందర్శించనున్నట్లు సమాచారం.
మిస్ వరల్డ్ కంటెస్టెంట్స్ షెడ్యూల్ ఖరారు చేసిన అధికారులు


