ఇసుక లారీ వేగానికి ఓ ప్రాణం బలి
కాటారం: ఇసుక లారీ డ్రైవర్ అతివేగం, అజాగ్రత్తకు ఓ నిండు ప్రాణం బలైంది. రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్‌బాబు స్వగ్రామమైన జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండలం ధన్వాడకు చెందిన రాజలింగు(58) కాటారం మండల కేంద్రంలో జరిగిన బంధువుల వివాహ వేడుకకు హాజరై ద్విచక్ర వాహనంపై వెళ్తూ ఇసుక లారీ ఢీ కొని మృతిచెందాడు. ప్రత్యక్ష సాక్ష్యులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ధన్వాడకు చెందిన తుల్సెగారి రాజలింగు బయ్యారం సమీపంలోని ఓ ఫంక్షన్‌హాల్‌లో జరిగిన బంధువుల వివాహానికి ద్వి చక్రవాహనంపై వెళ్లాడు. కార్యక్రమం ముగిసిన అనంతరం బైక్‌పై ఇంటికి తిరుగు ప్రయాణమయ్యాడు. చింతకాని క్రాస్ సమీపంలోకి రాగానే భూపాలపల్లి వైపుగా వస్తున్న ఇసుక లారీ వేగనియంత్రణకు ఏర్పాటు చేసిన బారికేడ్లను తప్పించబోయి రాంగ్‌రూట్‌లో వచ్చి రాజలింగు బైక్‌ను బలంగా ఢీకొట్టింది. దీంతో రాజలింగు కాలు ఎముకలు లారీ ముందు భాగంలో చిక్కుకొని తెగిపోవడంతోపాటు ఆయన రోడ్డుపై ఎగిరిపడ్డాడు. తలకు తీవ్రగాయమవడంతో అక్కడికక్కడే మృతిచెందాడు. సమాచారం అందుకున్న ఎస్సై అభినవ్, పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని వివరాలు సేకరించారు. తమకు న్యాయం జరిగే వరకు మృతదేహాన్ని తీయబోమని రాజలింగు కుటుంబ సభ్యులు, బంధువులు నిరసనకు దిగే ప్రయత్నం చేశారు. గంటపాటు ఎస్సై బాధిత కుటుంబ సభ్యులతో చర్చలు జరిపి న్యాయం జరిగేలా చూస్తామని హామీ ఇచ్చారు. అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం భూపాలపల్లి ప్రభుత్వాస్పత్రికి తరలించారు. మృతుడి కుమారుడు రామకృష్ణ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పీఎస్సై గీతారాథోడ్ తెలిపారు.
మృతుడిది మంత్రి శ్రీధర్‌బాబు స్వగ్రామం


