మెళకువలు పాటిస్తే అధిక లాభాలు
గూడూరు: రైతులు వ్యవసాయ అధికారులు, శాస్త్రవేత్తల సలహాలు, సూచనలు పాటిస్తే అధిక దిగుబడులు సాధించి లాభాలు పొందవచ్చని కేవీకే సమన్వయ కర్త మాలతి, డీఏఓ విజయనిర్మల అన్నారు. గూడూరు శివారు వడ్డెరగూడెం రైతు వేదికలో బుధవారం కృషి విజ్ఞాన కేంద్రం మల్యాల, వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో ప్రభుత్వం చేపట్టిన రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు అనే కార్యక్రమం మండల వ్యవసాయ అధికారి అబ్దుల్ మాలిక్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. రైతులు భూమి సారాన్నిబట్టి తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభాలు పొందే పంటలను సాగు చేయాలన్నారు. రసాయన ఎరువులను తగ్గించి, సేంద్రియ ఎరువుల వాడకాన్ని పెంచాలన్నారు. మోతాదుకు మించి రసాయన ఎరువుల వాడకంతో పంటలు, పొలంతో పాటు రైతులు అనారోగ్యం బారినపడతారని వివరించారు. అదే విధంగా తరచూ పంటల మార్పిడి చేయడంతో భూమి మరింత సారవంతంగా మారుతుందన్నారు. లైసెన్స్ కలిగిన మందుల షాపుల్లోనే విత్తనాలు, ఎరువులు కొనుగోలు చేయాలని, వాటి రశీదులు భద్రపర్చుకోవాలని కోరారు. రైతులు ఉద్యానవన పంటల సాగుపై దృష్టి సారించాలని, ప్రత్యామ్నాయంగా ఆయిల్‌పామ్ పంటలపై సబ్సిడీ లభిస్తుందని ఉద్యానవన, పట్టుపరిశ్రమ అధికారి మరియన్న తెలిపారు. ఏడీఏ శ్రీనివాసరావు మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన విధంగా రైతులందరూ వ్యవసాయ విస్తరణ అధికారులను సంప్రదించి ఫార్మర్ రిజిస్ట్రీ చేయించుకొని విశిష్ట గుర్తింపు కార్డులను పొందాలని అన్నారు. అనంతరం కరపత్రాలను ఆవిష్కరించారు. శాస్త్రవేత్తలు క్రాంతికుమార్, రాంబాబు, ఉపాధ్యాయుడు బి. శ్రీనివాస్, ఏఈఓలు అలెఖ్యరెడ్డి, మనోజ్, మధు, వినయ్, సుస్మిత పాల్గొన్నారు.


